బీజేపీలో చేరిన ఒక్కరోజులోనే భోపాల్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశాన్ని పొందిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆ పార్టీకి ఎక్కడ లేని చిక్కులు తెచ్చి పెట్టారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైలుకెళ్లి బెయిల్ పొందిన సాధ్వీ ముంబై ఉగ్రదాడిలో ముష్కరులతో పోరాడుతూ అమరుడైన హేమంత్ కర్కరేను ఆమె అనరాని మాటలు అన్నారు. నాశనమైపోతావంటూ తాను శాపం పెట్టానని, సరిగ్గా 45 రోజులకు తన శాపం తగిలి కర్కరే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతిలో మరణించారని కసిగా చెప్పారు. సాధ్వీ ప్రజ్ఞ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. సాధ్వీ లాంటి వ్యక్తులకు టికెటిచ్చిన బీజేపీ తీరును సైతం తప్పు పడుతూ సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
ముంబైలో ఉగ్రదాడిని జనం గుర్తుచేసుకుంటున్నారు. ఉగ్రవాదులతో పోరాడుతూ కర్కరే ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటున్నారు. దేశభక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే బీజేపీలో సాధ్వీ ప్రజ్ఞకు ఎలా స్థానం కల్పించారని జనం ప్రశ్నిస్తున్నారు. హిందూత్వను దివిటీ పట్టుకుని నడిపించే నేతలుగా చెప్పుకునే బీజేపీ, హేమంత్ కర్కరే భారతీయుడన్న సంగతి గుర్తు లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. పోలీసు అధికారులు ప్రాణాలకు తెగించి నేరస్తులతో పోరాడతారని తెలిసి కూడా సాధ్వీ అలాంటి వ్యాఖ్యలు చేయడం పలువురు పోలీసు అధికారులు తప్పుపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో సాధ్వీ పట్ల, బీజేపీ పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆమెను వెంటనే పోటీ నుంచి విరమించజేయాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. కొందరు నేతలను కట్టడి చేయడంలో బీజేపీ అధిష్టానం విఫలమైనందునే ఇప్పుడు సాధ్వీ లాంటి వారు రెచ్చిపోతున్నారని జనం గుర్తు చేస్తున్నారు.
ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సాధ్వీ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేసింది. ఉగ్రవాదులతో పోరాడుతూ మరణానంతరం అశోక్ చక్ర పొందిన హేమంత్ కర్కరేను అవమానపరచడం గర్హనీయమని ఐపీఎస్ అధికారులు అంటున్నారు అమరులను గౌరవించడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరో పక్క బీజేపీ తన నైజాన్ని నిరూపించుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కమలం పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అది సాధ్వీ వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడించింది. ఇంత జరిగిన తర్వాతే సాధ్వీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు మరిన్ని వివాదాలకు అవకాశమిస్తున్నాయి.