తునిలో అంత విధ్వంసకాండ జరిగితే ఇంటలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయింది? అసలు ఇన్పుట్స్ వున్నాయా లేదా అని అడిగితే ‘వున్నాయి’ అనే జవాబు చెబుతున్నారు సంబంధిత అధికారులు. ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా రాస్తారోకో ప్రకటించడంతో పరిస్థితి అదుపు తప్పిందని చెబుతున్న మాట నిజం కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. సభ నుంచి నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లే అవకాశం వుందని ముందే నిఘా విభాగం హెచ్చరికలు అందజేసింది. అయితే ఈ స్థాయిలో దహనకాండ కూడా జరుగుతుందని వూహించలేదు.
పట్టాలపైకి ఎక్కుతారనుకున్నా తగు భద్రతా ఏర్పాట్లు చేయాలి కదా…అంటే చేశారు. 1500 మంది పోలీసులు అందుబాటులో వున్నారని ఒక ఉన్నతాధికారి చెప్పారు. “వారిని సంయమనం పాటించవలసిందిగా ఆదేశించాం. ఆ రోజున లాఠీచార్జీ లేదా కాల్పులు జరిగితే పరిస్థితి మరోలా వుండేది. ఆందోళనకారులు కోరుకున్నదదే. కావాలనే ఆ అవకాశం ఇవ్వలేదు,”’ అని ఆయన అన్నారు. “మరి అదే సంయమనం రాజకీయ వేత్తలు పాటించలేదు కదా…” అంటే నవ్వేశారు.
మాజీ మంత్రి పళ్లం రాజు జోక్యం చేసుకుని ముద్రగడకు నచ్చజెప్పి వుండకపోతే ఆ రోజు పరిస్థితి చేయి దాటిపోయి వుండేదన్న అంచనాలో ప్రభుత్వం వుంది. రాత్రికి గనక బైఠాయింపు కొనసాగివుంటే సంఘ వ్యతిరేక శక్తులు తునిలోనే గాక ఇతర చోట్ల కూడా ఉద్రిక్తత పెంచేవారని, విజయవాడలోనూ అలాటి సంకేతాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కనుక కొంత వరకూ ప్రమాదం విస్తరించకుండా ఆపగలిగారన్న మాట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు నాయకులతోనూ వీలైతే ఆందోళన కారులతోనూ మాట్లాడి కొంత వరకూ ఉపశమన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.