ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై ఆరోపణలు చేస్తున్నారు. పోలింగ్ సరళి నిరుత్సాహంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు వ్యాఖ్యలతో వైసీపీ నేతలకు ఎక్కడ లేని ధైర్యం తీసుకొచ్చింది. చంద్రబాబు పరోక్షంగా పరాజయాన్ని అంగీకరిస్తున్నారని నమ్మడం ప్రారంభించారు. చివరికి ఆ ఆత్మవిశ్వాసం మూడు రోజుల్లో.. చాలా పైస్థాయికి చేరింది. ఎంతగా అంటే… బెట్టింగ్‌లకు… సై అన్నారు. రూపాయికి.. రెండు రూపాయలు ఇచ్చేందుకు రెడీ అని.. టీడీపీ నేతలకు సవాళ్లు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో.. వైసీపీ నేతలకు ఎంతగా ఉత్సాహం వచ్చిందో.. టీడీపీ నేతల్లో అంతగా నిరుత్సాహం ఏర్పడింది. అందుకే వారు కూడా వెనక్కి తగ్గారు. బెట్టింగ్‌ల విషయంపై ఆలోచనలు చేశారు.
కానీ వైసీపీ నేతల్లో ఈ ఊపు మూడు రోజులకే తగ్గిపోయింది. ఆవేశ పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నమేమో అన్న ఆలోచనకు వస్తున్నాయి. క్షేత్ర స్థాయి.. బూత్ వారీ విశ్లేషణలు చేసుకున్న తర్వాత.. టీడీపీ నేతలు.. ఇప్పుడు కాస్త కాన్ఫిడెంట్‌గా మారారు. వైసీపీ నేతలు.. కాస్త వెనక్కి తగ్గుతున్నారు. నాలుగు రోజుల నుంచి క్షేత్రస్థాయిలో వాస్తవాల ఒక్కొక్కటి తెలియటం, పథకాలు పనిచేశాయనే సమాచారం బయటకు రావటం, పట్టణం ఓటర్లు తెలుగుదేశానికి మొగ్గారని తెలియటంతో బెట్టింగ్ రాయుళ్లు మునుపటి దూకుడు ప్రదర్శించటంలేదు.
ఈసారి ఎన్నికల్లో ముస్లింలు తెలుగుదేశానికి మొగ్గారని, ఇది స్పష్టంగా కనిపించిందని కూడా కొంత మంది టీడీపీ నేతలు పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. మహిళలలు, పట్టణాల్లో ఉండే ఓటర్లు కూడా మొగ్గారని, భవిష్యత్తు గురించి ఆలోచించారని చెబుతున్నారు. పోలింగ్ కు, లెక్కింపుకి మధ్య ఎక్కువ రోజులు సమయం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ బెట్టింగ్ మార్కెట్ ఊపందుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు పడిపోయింది. ఇప్పటికే కాసిన వాళ్లు మాత్రం.. కాస్త నమ్మకంగానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంత మంది .. ఎంతో కొంత కమిషన్ ఉంచేసుకుని తమ బెట్టింగ్ క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏపీలో పరిస్థితులన్నీ మైండ్ గేమ్ మీదనే నడుస్తున్నాయి.