ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రధాన ప్రతిపక్ష పాత్రను గత ఐదేళ్లూ పోషించింది. ఏపీలో బలమైన పార్టీగా ఎదిగిన వైకాపా, తెలంగాణలో మాత్రం పార్టీ మనుగడ గురించి ఆలోచించడమే లేదనేది వాస్తవం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా పోటీకి దిగలేదు. ఈ మధ్యే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా వైకాపా నుంచి అభ్యర్థులెవరూ తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో లేరు. అయితే, ఇక తెలంగాణలో వైకాపా ఆశలు వదిలేసుకున్నట్టా… అంటే, లేదంటారు ఆ పార్టీ నాయకులు! లోక్ సభ ఎన్నికల సందర్భంలోనే, 2023లో తాము తెలంగాణ ఎన్నికల్లో నేరుగా పోటీ చేస్తామని వైకాపా ప్రకటించింది. సరే, ప్రస్తుతం వైకాపాకి తెరాసతో ఉన్న రాజకీయ అవసరాల నేపథ్యంలో తాజాగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. ఏపీలో చంద్రబాబు నాయుడుని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ తెరవెనక నుంచి మద్దతు ఇచ్చారన్నదీ బహిరంగ రహస్యమే.
తెలంగాణలో పార్టీ ఉంటుందని ప్రకటించిన వైకాపా… ఇప్పుడా ఉనికిని కాపాడుకోవడం కోసం చెయ్యాల్సింది చేస్తోందా అనేదే ఇప్పుడు చర్చ. 2023 ఎన్నికల్లో పోటీకి సిద్ధమవ్వాలంటే, ఇప్పట్నుంచీ ఒక పద్ధతి ప్రకారం పార్టీని విస్తరిస్తూ వెళ్లాల్సి ఉంటుంది కదా. అలాంటి అవకాశం ఇప్పుడు వైకాపా ముందు ఉంది. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలో పోల్చితే ఇవి కాస్త భిన్నం. ఎందుకంటే, నేరుగా పార్టీ పేరుతో అభ్యర్థులు రంగంలోకి దిగుతారు. కాబట్టి, వైకాపా కూడా తెలంగాణ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చెయ్యొచ్చు. తద్వారా క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది. మరో ఐదేళ్ల తరువాత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దిగాలని టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి… ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. కనీసం కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వైకాపా తరఫున గెలిచినా.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను కొనసాగించడానికి ఒక వ్యవస్థ ఏర్పడ్డట్టు అవుతుంది.
అయితే, ప్రస్తుతం వైకాపాలో ఈ చర్చే జరగడం లేదు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్థావనే ఆ పార్టీ వర్గాల్లో లేదనేది వాస్తవం! వారి ఫోకస్ అంతా ఏపీ మీదే ఉంది. ఎన్నికలు ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చాక, తెలంగాణ గురించి ఆలోచించే అవకాశం కొంతైనా ఉండొచ్చు. చూడాలి మరి, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై వైకాపా ఈలోపుగా స్పందిస్తేమో!