తెలుగుదేశం పార్టీ నేతలకు గవర్నర్ నరసింహన్ అంటే ఎంత ఆగ్రహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అత్యవసరం, తప్పదు అనుకుంటే తప్ప.. గవర్నర్ కు మొహం చూపించడానికి కూడా ఇష్టపడరు టీడీపీ నేతలు. ఆయన పూర్తిగా.. టీడీపీకి వ్యతిరేకంగా.. టీఆర్ఎస్, వైసీపీలకు సహకరిస్తున్నారని.. రాజ్‌భవన్‌లో రాజకీయం చేస్తున్నారని నమ్మకం కుదిరిన తర్వాత .. అధికారికంగా.. గవర్నర్ ఇచ్చే టీ పార్టీలకు కూడా మొహం చాటేస్తున్నారు. అయితే హఠాత్తుగా… గవర్నర్‌తో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఆయన ఓ రకంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికి గవర్నర్ బాగా సహకరించారని చెప్పుకొచ్చారు. అసలు గవర్నర్ సహకరించలేదని.. పైగా ప్రభుత్వంపై కుట్రలు చేశారని…ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. అనేక మంది టీడీపీ నేతలు పలుమార్లు ఆరోపించారు.
అయితే..కోడెల మాత్రం డిఫరెంట్ వెర్షన్ వినిపించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తో కోడెల సమావేశమయ్యారు. తాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ హోదాలో… గవర్నర్‌తో సమావేశమయ్యానని.. స్పీకర్ చెప్పుకొచ్చారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లయినందునే ..మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు, హింసపై గవర్నర్‌కు వివరించానన్నారు. కోడెల ఇలా ఒక్కసారిగా గవర్నర్ కు అనుకూలంగా మాట్లాడటం.. ఏపీ రాజకీయవర్గాల్లో .. కాస్త సంచలనం అయింది. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల్లో.. ఇనిమెట్ల అనే గ్రామంలో… కోడెల బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డారని.. వైసీపీ కొద్ది రోజుల కిందట గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు.
సీసీ టీవీ ఫుటేజీ బయటపెడితే అసలు నిజమేమిటో తెలుస్తుందని డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ఈసీ స్పందించలేదు. ఈ క్రమంలోనే కోడెల… అనూహ్యంగా గవర్నర్‌తో సమావేశం కావడం… ఆయన బాగా సహకరిస్తున్నారని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే కోడెల ఆ మాటలను సీరియస్‌గా కాకుండా..సెటైర్‌గా అనిఉంటారని.. కొంత మంది అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.