పాక్ బుద్ది మారలేదు.. బహుశః ఎన్నటికీ మారదేమో కూడా. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి జరిగిన తరువాత భారత్ చాలా తీవ్రంగా స్పందించడంతో, ఆ దాడికి కుట్ర పన్నినవారిని పట్టుకొంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి హామీ ఇచ్చారు. అందుకోసం ఉన్నతాధికారులతో కూడిన ఒక కమిటీని కూడా వేశారు. అందులో ఐ.ఎస్.ఐ.కి చెందిన ఉన్నతాధికారి కూడా ఉన్నారు. కొండని త్రవ్వి ఎలుకని పట్టుకొన్నట్లుగా, నెలరోజులు దర్యాప్తు చేసి భారత్ ఇచ్చిన ఆధారాలు సరిపోలేదు ఇంకా కావాలని భారత్ ని కోరారు. ఆ నాటకం అక్కడ అలాగ సాగదీస్తూనే ఇక్కడ మళ్ళీ పఠాన్ కోట్ లో మరో కుట్రకి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
నిఘా వర్గాల అందించిన సమాచారంతో పంజాబ్ పోలీసులు ఇర్షాద్ అహ్మద్ అనే వ్యక్తిని పఠాన్ కోట్ లో ఈరోజు ఉదయం అరెస్ట్ చేసారు. ఒక సాధారణ రోజువారి కూలీగా పనిచేస్తున్న అతను జమ్ములోని సజీద్ అనే పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ.ఏజంటు కోసం పనిచేస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. పఠాన్ కోట్ లో గల మమూన్ ఆర్మీ ప్రధాన స్థావరం వద్ద అతను పనిచేస్తూ తన వద్ద ఉన్న ఫోన్ తో ఆర్మీ వాహానాలు, ఆయుధాలు, బలగాలు, అవి ఉండే ప్రదేశాల ఫోటోలు తీసి వాటిని సాజిద్ కి పంపిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇర్షాద్ నుండి అందుకొన్న ఆ వివరాలను, ఫోటోలను అతను ఈ-మెయిల్ ద్వారా ఐ.ఎస్.ఐ.కి పంపిస్తున్నట్లు కనుగొన్నారు. ఇర్షాద్ నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్న ఫోన్ లో ఆర్మీకి చెందిన అత్యంత ముఖ్యమయిన వివరాలను తెలియజేసే ఫోటోలున్నాయి. జమ్ములో సాజిద్ ని అరెస్ట్ చేసిన తరువాత అతని ద్వారా ఇర్షాద్ సంగతి బయటపడింది. ఇర్షాద్ అహ్మద్, సాజిద్ ఇద్దరినీ నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొని వారిని ప్రశ్నించడానికి డిల్లీకి తరలించినట్లు సమాచారం.
ఇంతకు ముందు పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ లో భారత్ కి అత్యంత కీలకమయిన, వ్యూహాత్మకమయిన ఎయిర్ బేస్ ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసారు. దానికి ఐ.ఎస్.ఐ.యే అవసరమయిన శిక్షణ ఇచ్చినట్లు భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మళ్ళీ నెలరోజులు గడువక ముందే అదే ప్రాంతంలో ఉన్న ఆర్మీ స్థావరంపై ఐ.ఎస్.ఐ. గూడచర్యానికి పాల్పడటం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తోంది.
మమూన్ లో ఉన్న ఆర్మీ స్థావరం భారత్ లో కెల్లా అత్యంత పెద్దది. చాలా వ్యూహాత్మకమయిన ప్రదేశంలో ఉన్నది. దానిపై పాక్ ఐ.ఎస్.ఐ. గూడచర్యానికి పాల్పడుతోంది. అంటే తరువాత ఎయిర్ బేస్ తరువాత దానిపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందా? లేకపోతే భవిష్యత్ లో ఎప్పుడయినా యుద్ధం జరిగితే అది మొదలవక ముందే భారత్ ని చావు దెబ్బ తీయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకొంటోందా? అనే సందేహం కలుగుతోంది. ఇంత జరిగిన తరువాత కూడా పాక్ యధాప్రకారం తన వక్రబుద్ధి ప్రదర్శించుకొంటూనే ఉండటం చూస్తే కుక్క తోక వంకర అన్నట్లుంది.