తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పరిషత్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్ మరో సారి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇప్పటికే పదిమంది కాంగ్రేస్ ఎమ్మెల్యను కారెక్కించిన అధికార పార్టీ తాజాగా మరో ముగ్గురికి గాలం వేసింది. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లు టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల ఇరవై ఎనమిది లోపు వారు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జగ్గారెడ్డి తన అనుచరులతో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఇదే విషయమై సమావేశం అయినట్లు బయటకు పొక్కింది. నిన్నంతా మీడియాలో ప్రచారం జరిగినా దీనిపై.. వారి నుంచి పెద్దగా ఖండన ప్రకటనలు రాలేదు.
ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే మాత్రం కాంగ్రేస్ పార్టీ శాసనసభలో ప్రతిపక్ష హోదాకోల్పోయే ప్రమాదం ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అందులో పదమూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే కాంగ్రేస్ కు ప్రతిపక్ష హోదా దూరం అవుతుంది. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రేస్ కు హ్యాండిచ్చి కారెక్కారు. ఇప్పుడు మరో ముగ్గురు పేర్లు బయటకు వచ్చాయి. అదే జరిగితే పదమూడు మంది తమను టీఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయమంటూ స్పీకర్ లేఖ ఇస్తే దాని ప్రకారం స్పీకర్ విలీనం పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో అసెంబ్లీలో టీడీఎల్పీని, మండలిలో కాంగ్రేస్ ఎల్పీని ఇదే వ్యూహంతో టీఆర్ఎస్ ఎల్పీ కలిపేశారు. అదేపద్దతిలో ఇప్పుడు కూడా సభలో కాంగ్రేస్ కు ప్రతిపక్షహోదాలేకుండా చేసేందుకు అధికార పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్‌లో మిగిలిన వారిలో దుద్దిళ్ల శ్రిధర్ బాబు, పైలట్ రోహిత్ రెడ్డి, సీతక్క ల పేర్లు కూడా టీఆర్ఎస్ నేతలు ప్రచారంలోకి పెడుతున్నారు. కొత్తగా ప్రచారంలోకి వచ్చిన పేర్లతకో కలిపి.. 104 మంది సభ్యులు టీఆర్ఎస్‌కు ఉంటారు. ఏడుగురు… ఎంఐఎం సభ్యులు. ఒకరు టీడీపీ. కాంగ్రెస్‌కు నికరంగా నలుగురు, ఐదుగురు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలే అవకాశం కనిపిస్తోంది. ఒకరు పీసీసీ చీఫ్, ఇంకొకరు సీఎల్పీ చీఫ్… మిగిలిన వాళ్లు ఎవరుంటారో అంచనా వేయలేని పరిస్థితి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేరేమో..?