హైదరాబాద్: మొన్న ఆదివారం తునిలో కాపు రిజర్వేషన్ ఉద్యమం అదుపుతప్పి హింసాత్మక రూపు దాల్చటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న స్పందించిన సంగతి తెలిసిందే. కేరళలో షూటింగ్‌ను నిలిపేసుకుని మరీ ఆయన ఆఘమేఘాలమీద హైదరాబాద్ చేరుకుని దీనిపై స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే మీడియాతో మాట్లాడారంటూ ‘బాబు చేతిలో బాణమా’ అనే ఒక కథనాన్ని సాక్షి పత్రిక ఇవాళ ఇచ్చింది. అమరావతి మొదలు తునివరకు టీడీపీకి వత్తాసు పలికారని ఆ కథనంలో విమర్శించింది. రాజధాని రైతులకు అండగా ఉంటానంటూనే స్వరం మార్చారని వ్యాఖ్యానించింది. అంగన్వాడి, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆరోగ్యమిత్రలపై పవన్ ప్రశ్నించలేదని విమర్శించింది. మరోవైపు పవన్ చంద్రబాబు నాయుడుకు చెయ్యిచ్చారా అని కూడా కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇంత భారీసభకు జనం పెద్ద సంఖ్యలో వస్తారని అంచనావేయకపోవటం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం ప్రభుత్వలోపమని పవన్ వ్యాఖ్యానించటాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నారు.
ఆ వాదనలెలా ఉన్నా, నిన్న పవన్ ఏమి చెప్పదలుచుకున్నాడో స్పష్టంకాలేదు. ఆయన తన ప్రెస్ మీట్లో చెప్పిన పాయింట్లన్నీ బాగానే ఉన్నాయి. మనదేశంలో ఒక సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ ఉందని, ఒక మాట ఎక్కువ మాట్లాడినా, తక్కువ మాట్లాడినా వివాదాలు ఏర్పడతాయనటం, ప్రతి రాజకీయ నాయకుడూ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, వ్యవహరించాలని చెప్పటం వరకు అంతా బాగానే ఉంది. కానీ సమస్య పరిష్కారానికి తానేమి చేస్తాడోగానీ, ప్రభుత్వం ఏమి చేయాలనేదిగానీ నిర్దిష్టంగా, కాంక్రీట్‌గా చెప్పటంలేదు. మరి ఇంతోటి దానికి కేరళనుంచి షూటింగ్ విరమించుకుని మరీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి స్పందించాల్సిన అవసరమేముందో అర్థం కావటంలేదు. ఒక ప్రకటన విడుదల చేసినా సరిపోతుంది.
నిజానికి పవన్‌కు సమస్య పరిష్కారంపట్ల చిత్తశుధ్ధి ఉంటే, మధ్యవర్తిత్వం వహిస్తానని ముందుకు రావాలి. ఎలాగూ కాపు సామాజికవర్గంలో ఆయన మాటలకు విలువ ఉంది కాబట్టి ప్రభుత్వానికి – కాపు పెద్దలకు మధ్య చర్చలకు కావల్సిన వాతావరణం కల్పించటం, చర్చలు జరిగేలా చూడటం వంటి పనులు చేయొచ్చు. అయితే అలా చేస్తే కాపు ముద్ర పడుతుందని పవన్ భయపడుతున్నట్లుగా కనబడుతోంది. అయితే తాను ఈ స్థాయి నాయకుడవటానికి ప్రధాన కారణం కాపు సామాజికవర్గానికి గణనీయసంఖ్యలో ఉన్న ఓట్లు, తన పట్ల వారి ప్రేమ అనేది పవన్ తెలుసుకోవటంలేదు. ఒకవేళ అతను కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిని కాననుకున్నా కూడా సమస్య పరిష్కారంపట్ల చిత్తశుద్ధి ఉంటే కులం ప్రతినిధిలాగా కాకుండా ఒక తటస్థుడిగా దీనికి చొరవ చూపించొచ్చు. అలా కాకుండా కేవలం ధర్మపన్నాలు, నీతిసూత్రాలు వల్లించటం వలన ఉపయోగమేమీ లేదు. అసలు రాజకీయంగా ఏమి సాధించాలనేదానిపై అతనికి స్పష్టత ఉందో, లేదో అనేదే తెలియటంలేదు.