ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా అపరిమితమైన ప్రేమాభిమానాలు లభిస్తున్నాయని, దీన్ని మోడీ వేవ్ కాదని కొంతమంది ప్రచారం చేసింత మాత్రాన నష్టమేమీ ఉండదన్నారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు మోడీ హవా మరింత పెరిగిందనీ, 2019లో కూడా మోడీ ప్రధాని కావాలనేది దేశ ప్రజల కోరిక అన్నారు. గత ఎన్నికల్లో మోడీ పర్సనాలిటీ, అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలతో ప్రజల్లోకి వెళ్లామన్నారు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి మోడీ ప్రతిష్ట మరింత పెరుగుతూ వచ్చిందన్నారు. ఐదేళ్లుగా ఆయన చేసిన మంచి పనుల రిపోర్టు కార్డు తమ దగ్గర ఉందన్నారు రామ్ మాధవ్. ఈ ఎన్నికల్లో కూడా మోడీ ఇమేజ్, ప్రధానిగా ఆయన సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లామనీ, అన్ని వర్గాల నుంచి సమర్థన లభిస్తోందన్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల సొంతంగా ఎదగలేకపోయామన్నారు. అయితే, తెలంగాణలో ఇప్పుడిప్పుడే పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తోందన్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ దూరం కావడాన్ని ప్రస్థావిస్తూ… ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ముప్ఫై పార్టీలున్నాయన్నారు. ఎన్నికలు వచ్చేసరికి కొన్ని పార్టీలు చేరడం, విడిపోవడం అనేది సహజంగానే జరుగుతుందనీ, స్థానిక రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఎన్డీయే నుంచి బయటకి వెళ్లాయన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ కలయిక తమపై పెద్దగా ప్రభావం ఉండదనీ, ఆ రాష్ట్రంలో గతంలో దక్కించుకున్న సీట్లను భాజపా కాపాడుకుంటుందని రామ్ మాధవ్ అన్నారు. రెండు పార్టీలు కలిసినంత మాత్రాన, ఆ రెండు శక్తులూ కలిసిపోయి ఒక పెద్ద శక్తి అవుతుందనే లెక్కలు వెయ్యకూడదన్నారు. రాజకీయాలు అర్థమెటిక్ కాదనీ, రాజకీయాలంటే కెమిస్ట్రీ అన్నారు.
భాజపా తరఫున ప్రచారం చేస్తున్న మోడీ అమిత్ షాలుగానీ, ఇలా అడపాదడపా మీడియాతో మాట్లాడుతున్న ఆ పార్టీ ప్రతినిధులుగానీ… సూటిగా స్పష్టంగా మోడీ పాలన విజయాల గురించి మాట్లాడటం లేదు. ఐదేళ్లలో ఆయన చేసింది ప్రజల్లోకి తీసుకెళ్లామనే చెబుతున్నారు. ఇంతకీ చేసింది ఏంటి..? మోడీ పాలన విజయాలపై ప్రోగ్రెస్ కార్డు ఉందంటారు, కానీ ఆ ప్రోగెస్ ఏంటీ ఎక్కడా అనేది స్పష్టంగా చెప్పడం లేదు. గత ఎన్నికల్లో నాటి అధికార పార్టీ వైఫల్యాలతో ప్రజల్లోకి వెళ్లామన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో రూలింగ్ పార్టీగా సాధించిన విజయాలేంటో చెప్పడం లేదు!