ఎన్నికల సంఘానికి అత్యధిక ఫిర్యాదులు అందించిన నాయకుడిగా ఒక రికార్డు స్థాపించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టున్నారు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి! ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు, ఇప్పటివరకూ ఆయన ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి విజయసాయి తాజాగా ఒక ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందనీ, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉల్లంఘించారనీ, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో కోరారు.
ప్రభుత్వ సదుపాయాలతో ఎమ్మెల్యేలతో కలిసి ప్రజావేదికలో సమావేశాలు సీఎం నిర్వహిస్తున్నారని విజయసాయి ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అవసరాల కోసం ప్రజా వేదికను సీఎంతోపాటు మంత్రులు కూడా వాడుకుంటున్నారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ఒక పార్టీకి చెందినవారే ప్రభుత్వ ఆస్తులైన వీడియో కాన్ఫరరెన్స్ హాళ్లు, సదుపాయాలను వాడుకోవడం సరికాదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు, మీటింగ్ హాళ్లు, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం… ఇలాంటివన్నీ అన్ని పార్టీలకూ సమానంగా వాడుకునే అవకాశం కల్పించాలని విజయసాయి కోరడం విశేషం! ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతులు తీసుకుని చేస్తున్నవా కాదా అనేది కూడా తమకు తెలియజేయాలని విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రధాన అధికారిని కోరడం జరిగింది! ఇక, వారు స్పందించడమే తరువాయి అనుకోవచ్చు.
ఇప్పుడూ… ఏపీలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను గవర్నర్ కి అందించి, ఎన్నికలకు వెళ్లలేదు కదా? అలాంటప్పుడు, ఎన్నికలు పూర్తయినా కూడా, ఫలితాలు విడుదలైన తరువాత కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ కూడా ముఖ్యమంత్రి కొనసాగుతారు కదా! ప్రభుత్వం ఉంటుంది కదా. ఇంకోటి… సాంకేతికంగా చూసుకున్నా, గత అసెంబ్లీ కాలపరిమితి మరికొన్నాళ్లు ఉండగానే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకీ ఫలితాలకూ మధ్య నలభై రోజులకుపైగా గ్యాప్ ఉంది. ఈలోగా ప్రభుత్వం ఉంటుంది కదా! ఎన్నికలు కోడ్ ఉన్నా కూడా… వాటిని ప్రభావితం చేసే విధమైన నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వాలు తీసుకోకూడదు. అంతేగానీ, సమావేశ మందిరాలను వాడకూడదు, కుర్చీల్లో కూర్చోకూడదు ఇలాంటివి ఉంటాయా..? విజయసాయి ఫిర్యాదుపై ద్వివేదీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూద్దాం!