తెలంగాణ కాంగ్రెస్‌కు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. టీఆర్ఎస్ఎల్పీలో ఆ పార్టీకి చెందిన శాసనసభాపక్షాన్ని విలీనం చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపు ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ప్రతిపక్షం కాదు. ఓ మామూలు పక్షం. మగిలిన ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు.. ఒక్క ఎమ్మెల్సీతో.. కాలం గడపాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ నేతలు ఎంత అరచి గీ పెట్టినా… ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే.. కాంగ్రెస్సే.. తన గోతిని తాను తవ్వుకుంది కాబట్టి..!
పార్లమెంట్ తలుపులు మూసి చేసిన దానికి ప్రతిఫలం..!
తెలంగాణ పేరుతో.. ప్రజల్ని రెచ్చగొట్టి చేసిన ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభంతో.. ముగించాలనుకుంది. ఉక్కుమహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తిని.. పూర్తిగా.. తుంగలో తొక్కి.. రాజకీయ లాభం కోసం.. ప్రజాస్వామ్యానికి బీజేపీతో కలిసి పార్లమెంట్ సాక్షిగా పాతరేశారు. పార్లమెంట్ తలుపులు మూసి.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి సైతం సిగ్గుపడేలా .. అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహించి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. ఈ పాపంలో బీజేపీ భాగమే కానీ.. కాంగ్రెస్సే ప్రధాన ముద్దాయి. చేయాలనుకుంటే.. ప్రజాస్వామ్య బద్ధంగా చేయాలి. కానీ అప్రజాస్వామికంగా చేశారు. అదే అప్రజాస్వామికంగా… తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీకి.. అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఘోరీ కడుతోంది.
రాజకీయ లాభం రాకపోగా.. ఉన్నదీ ఊడిపోయింది..!
కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి… తెలంగాణ ఇచ్చిందని ఎవరూ అనుకోరు. తెలంగాణ ప్రజలు కూడా నమ్మలేదు. తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనం వస్తుందన్న ఆశతోనే.. తెలంగాణ ఏర్పాటు చేసింది. బీజేపీ కూడా.. అదే కారణంతో అంగీకరించింది. సంపూర్ణంగా సహకరించింది. కానీ.. ఇప్పుడు పరిణామాలు.. రాజకీయ ప్రయోజనాలు కలుగకపోగా… పార్టీనే అంతర్థానమయ్యే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఇస్తే.. ఏ పార్టీని అయితే.. కాంగ్రెస్ లో విలీనం చేస్తామని హామీ ఇచ్చారో.. అదే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మింగేస్తోంది. ఎక్కడా.. రాజకీయ విలువలు లేవు.. సంప్రదాయాలు అంత కన్నా లేవు. నైతికత అనే మాటే లేదు. కాంగ్రెస్ పార్టీ కి పతనం అంచున ఉంది. ఇదంతా.. కాంగ్రెస్ స్వయంకృతమే. అందుకే ఆ పార్టీ ఎన్ని చావు కేకలు పెట్టినా… అది ప్రజలకు వినోదంగానే ఉంటుంది.
తెలుగువారిని విడదీసిన పాపం… కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వదిలి పెట్టదు..!
42 పార్లమెంట్ సీట్లు ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. ఈ సీట్ల శక్తే… ఓ సారి… దేశ స్థాయిలో…ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్లో ప్రధానప్రతిపక్షంగా.. వ్యవహరించేలా చేయగలిగింది. తెలుగువారంటే.. ఏంటో చూపించే సత్తా వచ్చింది. కానీ..ఒక రాష్ట్రంగా ఉంటే.. 42 సీట్లు కలసికట్టుగా మారితే… ఢిల్లీలో తమ పెత్తనానికి అడ్డం పడుతుందని… జాతీయ పార్టీలు… కాంగ్రెస్, బీజేపీ భావించాయి. అందుకే ప్రజల మధ్య ఏర్పడిన అభిప్రాయాల బేధాలను చిచ్చుగా మార్చి.. చివరికి విడదీశారు. ఇప్పుడు.. 42లో ఓ పదిహేడు.. మరో ఇరవై ఐదు. ఎవరికి వారే. జాతీయ పార్టీల ప్లాన్ వర్కవుట్ అయింది. కానీ.. ఆ పార్టీలకు కూడా అదగి మరణశాసనంలా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి..!