ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ధైర్యం ఉన్న నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ముందు ఉంటారు. ఎన్నికల పోలింగ్ సరళిపై… టీడీపీ అధినేత సమీక్షా సమావేశానికి వచ్చిన ఆయన.. మీడియా ఎదుట గెలుపు ధీమాతో పాటు.. ఎన్నికలు జరిగిన తీరుపై కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఓట్లు వేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే వారు రూ. 2వేలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తీరు పూర్తిగా.. డబ్బుమయం అయిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు కలిసి పెట్టిన ఖర్చు రూ. పదివేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 25 కోట్లకు తక్కువ కాకుండా అభ్యర్థులకు ఖర్చులు అయ్యాయని తేల్చారు. తన నియోజకవర్గంలో… రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందనేది ఆయన ఆవేదనగా కనిపిస్తోంది. తను పోటీ చేయలేదు కానీ… తన కుమారుడు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి.. తాడిపత్రి నుంచి ఆయన సోదరుడి కుమారుడు పోటీ చేశారు. వీరి ఖర్చు గురించి జేసీ చెప్పి ఉంటారు.
ఎన్నికల్లో డబ్బు ప్రమేయంపైనే.. జేసీ ఆవేదన ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా వదిలేయాలని ఆయన అనుకోవడం లేదు. నేరుగా… ఓ వేదికను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఎన్నికల్లో డబ్బు ప్రమేయాన్ని తగ్గించడానికి… ప్రముఖులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు జేసీ చెబుతున్నారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేస్తానన ిఆయన అంటున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రమేయం తగ్గించకపోతే.. ముందు ముందు ఓటుకు రూ. 5వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని… స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంత కష్టం చేసినా.. ఓటర్లు గుర్తించలేదు కానీ.. వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చిన పెన్షన్లు, పసుపు-కుంకుమ పథకాలు మాత్రం ఓట్లు తెచ్చి పెట్టాయని.. జేసీ విశ్లేషించారు. చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. 120 సంక్షేమ పథకాలు ప్రవేశెడితే ఒక్కరైనా అభినందించారా అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవట్లేదని, పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛనే లేకపోతే మా గతి అథోగతయ్యేదని జేసీ చెప్పుకొచ్చారు. డబ్బు కాదు.. చేసిన పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలన్నారు.