కరాచీలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనానికి హాజరయ్యేందుకు తనకు పాక్ ప్రభుత్వం వీసా నిరాకరించినట్లు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చెప్పారు. కానీ పాక్ అధికారుల నుండి ఊహించని జవాబు వచ్చింది. పాక్ హైకమీషన్ ప్రధాన కార్యదర్శి అలీ మెమెన్ మీడియాతో మాట్లాడుతూ, “అనుపమ్ ఖేర్ అసలు వీసా కోసం దరఖాస్తే చేసుకోలేదు. అటువంటప్పుడు మేము ఆయనకి వీసా ఎలాగ నిరాకరిస్తాము? అసలు ఆయన తరపున ఎవరయినా వీసాకి దరఖాస్తు చేసారో లేదో చూసుకోకుండా ఇటువంటి ఆరోపణలు చేయడం తగదు,” అని అన్నారు.
అనుపమ్ ఖేర్ తో బాటు మరో 17మందికి ఆ సాహిత్య సమ్మేళనంలో అతిధులుగా పాల్గొనడానికి ఆహ్వానాలు అందాయి. వారందరికీ వీసాలు వచ్చేయి. కాని అనుపమ్ ఖేర్ ఒక్కరికే రాలేదు. పాక్ ప్రభుత్వం తనకు వీసా నిరాకరించిందని అనుపమ్ ఖేర్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన వీసా కోసం దరఖాస్తే చేసుకోలేదని పాక్ అధికారులు చెపుతున్నారు. బహుశః ఈ వ్యవహారం కూడా మరో ఆసక్తికరమయిన డ్రామాకి తెర తీస్తుందేమో చూడాలి.