ఇంటర్ బోర్డుపై వస్తున్న ఆరోపణలు సరైనవి కాదన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్. పేపర్ల వేల్యుయేషన్ అంతా చాలా పాదర్శకంగా జరిగిందనీ, కాకపోతే అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు చోటు చేసుకున్నాయన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక అంశాలపరంగా చిన్న పొరపాట్లు చోటు చేసుకున్నాయన్నారు. పరీక్షలకు హాజరుకానివారిని కూడా పాస్ చేయించామనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఒ.ఎమ్.ఆర్. షీట్ల జంబ్లింగ్ లో కొన్ని తప్పులు జరిగాయనీ, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామనీ, విద్యార్థుల రాసిన అన్ని సమాధాన పత్రాలు తమ దగ్గర భద్రంగా ఉన్నాయన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే రీవేల్యూయేషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చనీ, ఆన్సర్ పేపర్లను విద్యార్థులు స్వయంగా చూసుకోవచ్చన్నారు. అయితే, మొత్తం రీవేల్యూయేషన్ చేయడం అనేది సాధ్యం కాని పని అని తేల్చి చెప్పారు.
అయితే, ఇంకోపక్క ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు, చిన్న చిన్న తప్పిదాలు జరిగాయని బోర్డు చెప్పడం ఎంతవరకూ సమంజసం? ఫెయిలైనవారిని పాసైనట్టు ఎక్కడా చూపలేదని వివరణ ఇస్తున్నారుగానీ, పాస్ అయినవారిని ఫెయిల్ కాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే కదా! దాన్ని సక్రమంగా నిర్వర్తించకపోవడం చిన్న విషయం అవుతుందా..? ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో… ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే పరిస్థితికి కారణం అంటూ ఓ ప్రచారం సాగుతోంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, గవర్నమెంట్ లెక్చర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన రెడ్డికి మధ్య మొదలైన చిన్న వివాదమే ఇక్కడి వరకూ వచ్చింటున్నారు! ఒక కాంట్రాక్టుకు సంబంధించి ఈ ఇద్దరి మధ్యా వివాదం మొదలైందనీ, చివరికి అది ఇంటర్ ఫలితాల మీద ప్రభావితం చూపాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంటర్ పరీక్షల నిర్వహణ, పత్రాల ముద్రణ, ఫలితాలు.. ఇలా ఇవన్నీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ చూస్తుంది. ప్రతీయేటా ఈ సంస్థకే బోర్డు కాంట్రాక్ట్ ఇస్తుంటుంది. అయితే, ఈసారి ఆ సంస్థను కాదని… గ్లోబరీనాకు ఈ ఏడాది కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ సమయంలోనే, ఈ సంస్థకు కాంట్రాక్ట్ వద్దనీ, వారికి ఉన్న అనుభవం చాలదనీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేదా తాను సూచించిన సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వాలని మధుసూదన రెడ్డి పట్టుబట్టారట! దీన్ని అశోక్ పట్టించుకోలేదని సమాచారం. అక్కడి నుంచి బోర్డులో జరిగిన చిన్నచిన్న తప్పుల్ని పెద్దవిగా చూపించే ప్రయత్నం మధుసూదన రెడ్డి వ్యవహరించడం ప్రారంభించారని ఇంటర్ బోర్డు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఇద్దరి మధ్య గొడవకీ… తాజా పరీక్ష ఫలితాల్లో తప్పులకీ సంబంధం ఉందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా, మొత్తం వ్యవహారాన్ని చిన్న సమస్యగానో, ఇద్దరి మధ్య తలెత్తిన వివాదానికి ఫలితంగానో చూడకూడదు కదా!