విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రులతే బాధ్యత అని నాగేంద్రబాబు వీడియో పెట్టారు. తల్లిదండ్రులు… పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారట..!. పక్క పిల్లలతో పోల్చుతున్నారట..! అందుకే ఆత్మన్యూనతో.. వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట..!. మధ్యతరగతి కుటుంబాలంటే… నాగేంద్రబాబుకు ఉన్న చిన్న చూపు.. ఎంతో బాధకలిగింది. ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి తండ్రిగా.. పిల్లల భవిష్యత్ కోసం… చదువుల కోసం… సర్వం ధారబోస్తున్న తండ్రిగా నాగేంద్రబాబు మాటలు ఎంతో బాధించాయి. అందుకే నా స్పందనను ఇలా తెలియజేస్తున్నా..!
మధ్యతరగతి తల్లిదండ్రులు రాక్షసుల్లా కనిపిస్తున్నారా నాగేంద్రబాబూ..!
దేశంలో ఎనభై శాతానికిపైగా… మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలేనని .. మీకు తెలుసనుకుంటాను నాగేంద్రబాబు గారూ.. ! అంటే.. ఈ కుటుంబాలన్నింటికీ.. ఒక్క నెల జీతం రాకపోతే.. ఒక్క నెల పని లేకపోతే… పస్తులుండాల్సిన పరిస్థితి. మా జీవితల్లా .. మా కంటిపాపల జీవితాలు ఉండకూడదని… కోరుకుంటున్నాం. అందుకే… వారిని లక్షలు ఖర్చయినా అప్పు చేసి చదివించుకుంటున్నాం..! మరి జీవితం మొత్తం చదువులకో ధారబోస్తూంటే… వాళ్లు బాగా చదువుకోవాలని కోరుకోవడంలో.. తప్పేముందండి..?. ఒత్తిడి చేస్తున్నామని… పక్క వాళ్ల పిల్లలతో పోలుస్తున్నామని నిందలేస్తున్నారు… పోటీ వాతావరణంలో కాదా.. పిల్లలు… బెటర్ మెంట్ కోసం ప్రయత్నించేది..?. మా పిల్లలు.. మా కంటిపాపలండి నాగేంద్రబాబు గారూ.. ! వేరే వాళ్ల పిల్లలు కాదు.. వాళ్ల బాగు కోసమే… మేం జీవిస్తున్నాం..! వారిని ఉన్నత స్థితిలో చూసుకుని ఆనందపడటమే మా జీవితాశయం. వారిని సరైన మార్గంలో పెట్టకపోతే… అది మా ఫెయిల్యూరే కదా..!. మేం అలా చేయడం పాపం అంటున్నారు.. మీరు.. ఈ లెక్కన మేము పాపులమేనండీ నాగేంద్రబాబు గారూ.. !
మా పిల్లల గురించి మాకు తెలుసు..! ధైర్యం ఉంటే వ్యవస్థను ప్రశ్నించండి..!
మధ్యతరగతి తల్లిదండ్రుల ప్రధాన లక్ష్యం.. పిల్లలకు మెరుగైన విద్య అందించడమేనండి. ఆ విద్య కోసం.. రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన రూపాయలను లక్షలకు లక్షలు ప్రైవేటు కాలేజీలకు పోస్తూ ఉంటారు. మేమూ అంతే. ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం సన్నగిల్లేలా చేసి… ప్రైవేటు తప్ప… విద్య కొనడం తప్ప మరో దిక్కులేదనే పరిస్థితి తీసుకొచ్చిన రాజకీయ వ్యవస్థపై మీకు.. అభిమానం ఉండవచ్చు కానీ… చదువులు కొంటున్న తల్లిదండ్రుల్ని మాత్రం కించ పరచకూడదండి. మా తిప్పలు మేం పడతాం.. పిల్లల్ని ఎలా చదివించుకోవాలో మాకు తెలుసు… కానీ… చదువుల్ని కొలిచే వ్యవస్థను కూడా సక్రమంగా ఉంచలేని ప్రభుత్వాలను.. ప్రశ్నించడం మీకు చేత కాదా..?. దాన్ని కూడా ప్రాంతానికోరకంగా మార్చుకుంటారా..?. ఎంసెట్ పేపర్ రెండు సార్లు లీకయినట్లు బయటపడింది. ఇక బయటపడకుండా ఎన్ని సార్లు లీకయిందో..?. ఇప్పుడు పరీక్షల నిర్వహణ గందరగోళం. ఇక్కడ ఫెయిలయింది.. వ్యవస్థ…! ప్రశ్నించాల్సింది వ్యవస్థను..! మరి మీరేమిటంటండి.. మధ్యతరగతి తల్లిదండ్రుల్ని నిందిస్తున్నారు…?
పెద్ద పెద్ద మాటలే చెప్పారు..! ఇండస్ట్రీకి వస్తాం..! చాన్సులిస్తారా..?
నాగేంద్రబాబుది.. చాలా దొడ్డమనసు . ఆయన పెట్టిన వీడియోలో.. చదువులు సంకనాకిపోతే పోనీ… సినిమా ఇండస్ట్రీలోకి అయినా రావొచ్చంటూ.. కొత్త కొత్త కబుర్లు భలే చెప్పారు. ఏ ఇండస్ట్రీలోకి అండి నాగబాబు గారూ..! మీ ఫ్యామిలీ.. యాభై శాతం ఆక్రమించేసుకుని .. ఆఫీస్ బాయ్ దగ్గర్నుంచి… దర్శకుడు వరకూ.. అంతా మెగా క్యాంప్ అని ముద్ర వేసుకుంటే తప్ప.. అవకాశాలు రాని ఇండస్ట్రీలోకా..?. మెగా క్యాంప్‌కి ఆగ్రహం వస్తే.. రాత్రికి రాత్రి అడ్రస్ లేకుండా తరిమేసే పరిస్థితులు ఉన్న ఇండస్ట్రీలోకా…?. ఎంత మంది బయట యువకులకు.. సినిమాల మీద ప్రేమతో… ఇండస్ట్రీలోకి వస్తున్న వారికి… మెగా క్యాంప్ అవకాశాలు కల్పించిందో కాస్తంత చెబుతారా..?.అసలు కష్టపడి వచ్చిన వాళ్లను అడ్డంగా తొక్కేశారని.. ఇండస్ట్రీలో మెగా క్యాంప్ గురించి రకరకాల కబుర్లు చెబుతూ ఉంటారు. వాటిపై మీరు స్పందిస్తారా..? అంత ఎందుకు.. ఏ టూ జడ్గా… మీరు వ్యవహరిస్తున్న జబర్దస్త్‌లో.. అనేక మంది ప్రతిభావంతుల్ని.. టాలెంట్ కారణం కాకుండా.. ఇతర కారణాలతో… మీరు తొక్కేశారని జరుగుతున్న ప్రచారంలో నిజనిజాలేంటో చెప్పగలరా..? ఇండస్ట్రీలోకి రావొచ్చంటూ.. ఇలా ప్రకటించడం.. పిల్లల్ని మరింత చెడగొట్టడం కాదా..?.
ప్రతి ఒక్కరికి.. చిరంజీవి లాంటి బ్రదర్స్ ఇండస్ట్రీలో ఉండరండి. మీకు మీ బ్రదర్ ఉన్నారు కాబట్టి.. ఈ రోజు నాగబాబుగా.. అందరికీ పరిచయం లేకపోతే.. పిల్లల చదువుల కోసం తపనపడే.. మా లాంటి తల్లిదండ్రుల్లాగే..మీరూ ఉండేవారు. మీకు ధైర్యం ఉంటే వ్యవస్థను ప్రశ్నించండి..! తప్పులు దొర్లకుండా… పోరాటం చేయండి..! గౌరవం ఉంటుంది. కానీ.. అధికారానికి భయపడి.. దాసోహమయి… తప్పంతా… తల్లిదండ్రులు, పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేయకండి..! మీ మీద అసహ్యం వేస్తుంది..!
ఓ మధ్యతరగతి తండ్రి..!