ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ..తానే సర్వంతర్యామి అన్నట్లుగా వ్యవహరించడం కలకలం రేపుతోంది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం సంప్రదించకుండానే .. ఎన్నికల కోడ్ పేరుతో తనకు అధికారాలున్నాయంటూ.. ఆయన నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఓ వైపు.. ప్రభుత్వ సమాచారం.. ప్రతిపక్ష పార్టీలకు వెళ్తోందనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. కేబినెట్ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారనే వివాదామూ ఉంది. ఓ రకంగా.. వచ్చేది జగన్ ప్రభుత్వమే.. తానే సీఎస్‌గా కొనసాగుతాననే ధీమాతో.. ముందుగానే.. ప్రభుత్వాన్ని జగన్ ఆదేశాలతో నడుపుతున్నట్లుగా ఉంది సీఎస్ వ్యవహారం.
లోటస్ పాండ్ ఆదేశాలతో సీఎస్ నిర్ణయాలా…?
రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం అత్యున్నతం. ఎవరైనా మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అధికారవర్గాలకు ముఖ్యమంత్రి లాంటి పోస్ట్ అయిన చీఫ్ సెక్రటరీ అయినా మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను అమలు చేయాలి కానీ.. విమర్శించడం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం. కానీ… ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. కేబినెట్ నిర్ణయాలను విమర్శించారు. ప్రభుత్వానికి తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో ప్రతీసారి.. చివరి దశల్లో ఎన్నికలు జరుగుతాయి. అంటే.. పోలింగ్ ముగిసిన నాలుగైదు రోజుల్లో కౌంటింగ్ జరుగుతుంది. దాంతో.. పాలన విషయంలో ఎప్పుడూ ఆటంకాలు ఎదురు కాలేదు. కానీ ఈసారి… మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టారు. పోలింగ్‌కు కౌంటింగ్‌కు మధ్య నెలన్నర సమయం ఉంది. పోలింగ్ కు ముందే సీఎస్‌ను మార్చడం.. ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూడటంతో.. వివాదం ప్రారంభమయింది. ప్రభుత్వానికి చెందిన సున్నితమైన సమాచారం.. బయటకు వెళ్తోంది. టీటీడీకి అసలే మాత్రం సంబంధం లేని.. పూర్తిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంతర్గత వ్యవహారంపై… టీటీడీపై అనుమానం కలిగేలా.. విచారణకు ఆదేశించారు సీఎస్. ప్రభుత్వం ముందస్తుగా అనుమతి తీసుకున్న రూ. వెయ్యి కోట్ల రుణాన్ని కూడా.. ఏకపక్షంగా నిలిపివేశారు. ఇదంతా సీఎల్ ఎల్వీ చేస్తున్న ఏకపక్ష పాలన.
ఈసీ నియమించే సీఎస్‌కు ఈ అధికారాలుంటాయా…?
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి.. కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలు… స్వేచ్చగా, నిజాయితీగా జరిపేలా.. ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కొన్ని అధికారాలు కల్పించింది. దాని ప్రకారం… ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈసీ అధీనంలోకి వస్తుంది. ఈ మేరకు ఈసీ తన విచక్షణ మేరకు.. ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించుకుంటుంది. బదిలీలు చేస్తుంది. అయితే.. ఈ బదిలీలన్నీ… ఎన్నికల నిర్వహణ కోణంలోనే ఉంటాయి తప్ప.. రోజువారీ పాలనా వ్యవహారాలు.. ఎన్నికలకు సంబంధం లేని అంశాల విషయంలో ఉండవు. ఏపీలో అలా పలువుర్ని బదిలీ చేసింది. కారణాలు చెప్పకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పడానికి లేకపోయింది. అలా చీఫ్ సెక్రటరీగా ఉన్న పునేఠాను కూడా బదిలీ చేశారు. కొత్త సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించారు. ఎన్నికల విధుల కోసమే ఆయనను నియమించారు. ఎందుకంటే.. ఈసీకి ఉన్న పరిధి ఎన్నికల వరకే. కానీ.. ఈసీ ఆదేశాలతో పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు.. సీఎస్‌గా ప్రభుత్వాన్ని టేకోవర్ చేశారు. కోడ్ ఉంది కాబట్టి.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పని చేయకూడదని… తానే సర్వాధికారిని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. వచ్చే ప్రభుత్వం వైసీపీదేనని నిర్ధారించుకుని.. దానికి తగ్గట్లుగానే.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కూడా తానే సీఎస్ అవుతానని.. ఇతరులు ఎవరూ.. గీత దాటకూడదన్నట్లుగా అధికారం చెలాయిస్తున్నారు.
వైసీపీ గెలిస్తే తానే సీఎస్‌నని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు..?
ఎలక్షన్ కోడ్ ప్రధాన ఉద్దేశం.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఉండటం. ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఉండటం. ఇలాంటి అవకాశం అధికారపక్షాలకు.. పోలింగ్ జరిగే వరకే ఉంటుంది. కానీ.. పోలింగ్‌కు కౌంటింగ్ కు మధ్య ఉండే సమయంలో.. ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా చేయడం కాదు. ఈసీని మచ్చిక చేసుకుని నియమించుకున్న అధికారులతో.. పాలన ఇతరలు తమ చేతుల్లోకి తీసుకోవడం అసలు కాదు.. అంటున్న నిపుణులు. అందుకే.. సీఎస్ తీరు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమవుతోంది. గెలిచేస్తామంటున్న వైసీపీ.. ఫలితాలు రాక ముందు తమకు ఉన్న పలుకుబడి ఆధారంగా.. ఓ నమ్మకస్తుడ్ని సీఎస్ పోస్టులో కూర్చోబెట్టి.. పాలన ప్రారంభించేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం లాంటి వ్యవహారం.