ఏ నియోజకవర్గంలో అయినా ఫలితాలు అనుకూలంగా రావాలంటే.. రూ.10 కోట్లు సర్దుబాటు చేయండి చాలు.. మేము ఈవీఎంలను హ్యాక్ చేసి… ఫలితాలను మార్చేస్తామంటూ… రష్యన్ హ్యాకర్లు దేశంలో తిరుగుతున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వచ్చిన ఈ సమాచారాన్ని ముంబైలో మీడియా ముందు బయటపెట్టారు. రష్యన్ హ్యాకర్ల పేరుతో కొంత మంది అభ్యర్థుల్ని సంప్రదిస్తున్నారని.. రూ. ఐదు నుంచి పది కోట్ల వరకూ ఇస్తే.. ఫలితాన్ని అనుకూలంగా మారుస్తామని చెబుతున్నారని.. అంటున్నారు. దేశంలో క్షేత్ర స్థాయిలో ఈ ప్రచారం జరుగుతోందని.. ఇది నిజమో.. అబద్దమో కానీ.. పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహారాష్ట్రకు వెళ్లిన చంద్రబాబు అక్కడ.. పలువురు విపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈవీఎంలలో లోపాలు…వీవీ ప్యాట్లు యాభై శాతం లెక్కించడానికి చేయాల్సిన తదుపరి పోరాటంపై చర్చించారు.
ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని చంద్రబాబు మండిపడ్డారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపునకు 6రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్లో 7 సెకన్లు కనపడాలని.. అది కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందన్నారు. వీవీప్యాట్ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు సరితేలాలన్నారు. ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
దేశంలో.. నరేంద్రమోడీ మళ్లీ గెలుస్తారని ఎవరూ అనుకోవడం లేదు కానీ.. ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడం వల్ల ఆయన ప్రధాని అవుతారని.. అందరూ నమ్ముతున్నారని అంటున్నారు. మూడో దశ పోలింగ్ లోనూ… ఈవీఎంలు అనేక చోట్ల మొరాయించాయి. చిత్రవిచిత్రమైన సమస్యలు ఎదురయ్యాయి. కేరళలో ఓ వీవీ ప్యాట్ మిషన్లో పాము బయటపడింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి పడింది. ఫిర్యాదులు వస్తే ఈవీఎంను మార్చారు. మొదటి దశలో ఏపీతో ప్రారంభమైన ఈవీఎంల అవస్తలు.. మూడో విడతలోనూ.. అలాగే కొనసాగాయి.