ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే రాష్ట్రంలో పరిపాలనాపరంగా ఉన్నతాధికారి. కలెక్టర్లందరూ ఆయన పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అయితే, ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక… ఈ పరిస్థితి అంతా మారిపోతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒక సాధారణ అధికారిగానే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. కలెక్టర్లు అందరూ రిటర్నింగ్ ఆఫీసర్లు అయిపోతారు. ఈ వ్యవస్థ మొత్తం సీఈవో కింద పనిచేయాల్సి వస్తుంది. కోడ్ అమల్లో ఉన్నంతకాలం ఇదే పరిస్థితి ఉండాలి. అంటే, వీళ్లందరిపైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అజమాయిషీ ఉండదు. స్వతంత్ర వ్యవస్థగా ఎన్నికల సంఘం రంగంలోకి దిగాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొంతంగా ఎలాంటి సమీక్షలూ సమావేశాలు నిర్వహించరు. కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దీనికి భిన్నంగా సీఎస్ వ్యవహరిస్తున్నారని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఈరోజు కొన్ని సమీక్ష కార్యక్రమాలకు సిద్ధమైపోతున్నారు! తాను ఏర్పాటు చేస్తున్న సమీక్షకి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రావాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఈ ఆదేశాలపై ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. తామంతా సీఈవో పరిధిలో ఉన్నాం కదా, ఈ ఆదేశాలను ఎలా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట! ఇంకోపక్క, ప్రభుత్వ పథకాలపై కూడా సీఎస్ ఆరా తీస్తున్నారట. మరీ ముఖ్యంగా… టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ, పంఛెన్ల పెంపు, పసుపు కుంకం పథకాలపై ఆర్థిక శాఖ అధికారుల నుంచి వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. ఈ పథకాలకు సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, బడ్జెట్ ఆమోదం ఉందా అంటూ సుబ్రమణ్యం ప్రశ్నించారని సమాచారం. ఇతర కేటాయింపు నిధుల్ని ఇటువైపు బదిలీ చేశారా అంటూ కూడా అధికారులను ఆయన ప్రశ్నించారట. నిజానికి, ఈ మూడు పథకాలను అసెంబ్లీ ఆమోదంతోనే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త పథకాలను చేర్చాకనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకాలను మంత్రి మండలి ఆమోదం ఉన్నా కూడా… నిబంధనల ప్రకారమే నిధులు ఖర్చు చేశారా లేదా అంటూ సీఎస్ సమీక్షించారు.
ఈ సమీక్ష కొంత నయం. కానీ, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఎలా చెయ్యాలనేది కూడా సీఎస్ సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవడమే అధికార వర్గాల్లో చర్చనీయం అవుతోంది. అది ఈసీవో చూసుకోవాల్సిన పని కదా! ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా అది ద్వివేదీ పరిధిలోని అంశం అవుతుంది. ఇప్పుడు సుబ్రమణ్యం వ్యవహరిస్తున్న తీరు ఎన్నికల సంబంధ విషయాల్లో ఆయన తలదూర్చినట్టే అవుతుంది. మరి, సుబ్రమణ్యం సమీక్షపై ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.