ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి విమర్శించారు. ఆయన ప్రవేశపెట్టిన పసుపు కుంకం, ఇతర సంక్షేమ పథకాలను ప్రజలను నమ్మలేదని చంద్రబాబుకి అర్థమైపోయిందన్నారు. అందుకే, తన ఓటమికి కారణాలు టీడీపీ పరిపాలన కాదనీ, తన నిర్ణయాలు కాదనీ, కేవలం ఎన్నికల సంఘం నిర్వాకమే అని చెప్పడం కోసమే ప్రస్తుతం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈసీ నిర్వాకం వల్లనే ఫలితాలు ఇంత దారుణంగా వచ్చాయని చంద్రబాబు తరువాత చెప్పుకుంటారని అన్నారు. ఈవీఎంలపై పోరాటం అని చంద్రబాబు ఎంత హడావుడి చేస్తున్న ఇతర పార్టీల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదన్నారు.
వీవీప్యాట్ల ఏర్పాటుతో ఎన్నికల ప్రక్రియలో మరో ముందడగు పడ్డట్టేననీ, ఎన్నికల ప్రక్రియలో మరింత పాదర్శకత పెరిగినట్టే అని సజ్జల చెప్పుకొచ్చారు. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అంటూనే తెలుగుదేశం పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. తన గెలుపుకి కారణమైన ప్రజలకు ఆయన ఫలితాల రాకముందే కృతజ్ఞతలు తెలిపడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు తీరుని విశ్లేషిస్తే వైకాపా విజయం కనిపిస్తుందన్నారు. గెలుపు విషయమై తాము చాలా ధీమాగా ఉన్నామన్నారు.
సరే, వైకాపా నేతల ధీమా ఏంటి… ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఓటమికి వెతుక్కుంటున్న సాకులే అని కదా! అలాంటప్పుడు, వైకాపా నేతలు ఎందుకు ఇంతగా స్పందించేస్తుంటారు? ఎన్నికల తరువాత చంద్రబాబు ఏం చేస్తే వారికేం..? ఎన్నికల ఫలితాలను ఎవ్వరూ మార్చలేరు కదా? అయినాసరే, ఎన్నికల సంఘానికి ఏదో ఒక అంశాన్ని అడ్డం పెట్టుకుని ఫిర్యాదులు ఎందుకు చేయడం? ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలపైనా, సాధారణ పరిపాలన వ్యవహారాలపై జరిపే సమీక్షలపైనా ఎందుకంత విమర్శలు చేయడం..? ఎన్నికల ముందు కొంతమంది అధికారుల బదిలీల కోసం ఆరాటపడ్డారు. ఎన్నికల తరువాత కూడా అదే తరహాలో ఒక రకమైన ఆందోళనకు గురౌతున్నారు. గెలుపు వారి పక్షాన ఉన్నప్పుడు ధీమాగా ఉండొచ్చు కదా! ఇలా రోజుకో నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి కొత్తగా ఏమైనా చెప్తున్నారా లేదే? పోనీ, వారు చెప్తున్న ఒకే విషయం వల్ల ప్రజలకు ప్రాక్టికల్ గా ఏదైనా ఉపయోగం ఉందా..? అదీ లేదు కదా. మరెందుకీ ఊకదండపు ఉపన్యాసాలు?