తన సినిమా అనే సరికి.. దాదాపుగా ‘సహాయ దర్శకుడు’ గా పనిచేసేస్తుంటాడు దిల్‌రాజు. కథ దగ్గర్నుంచి, ఫైనల్ కాపీ వరకూ అన్ని విషయాల్లోనూ దిల్‌రాజు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బయటి సినిమాలకూ అప్పుడప్పుడూ తనవైన సలహాలూ సూచనలూ అందిస్తుంటాడు. అవి అప్పుడప్పుడూ వర్కవుట్ అవుతుంటాయి కూడా. తాజాగా ‘జెర్సీ’ విజయంలోనూ దిల్ రాజు హ్యాండ్ ఉంది.
‘జెర్సీ’ సినిమా విడుదలకు ముందే దిల్‌రాజుకి చూపించారు. ఆ సినిమా చూశాక దిల్ రాజు కొన్ని సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సెకండ్ ఆఫ్‌లో క్రికెట్ మ్యాచ్ సీన్లను దిల్‌రాజు దగ్గరుండి కుదించారని సమాచారం. సెకండాప్లో లాగ్ లేకుండా అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేశారని, ఒకట్రెండు సీన్లని పూర్తిగా తొలగించారని తెలుస్తోంది. ‘జెర్సీ’ తొలి సగంలో, అదీ ఒకే ఒక్క సీన్లో కనిపిస్తాడు బ్రహ్మాజీ. ద్వితీయార్థంలో బ్రహ్మాజీపై మరో సరదా సన్నివేశం తెరకెక్కించారు. అది కాస్త దిల్ రాజు ఎడిటింగ్‌లో ఎగిరిపోయింది. కాకపోతే ఆ సన్నివేశం చాలా బాగా వచ్చిందట. త్వరలో ఈ సీన్ జోడీస్తారేమో చూడాలి. క్రికెట్ నేపథ్యంలో సన్నివేశాలు బాగా వచ్చినా, అవి మహిళా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కవని, వాళ్ల కోసమైనా క్రికెట్ సీన్లు కుదించాలని దిల్‌రాజు గట్టిగా చెప్పాడట. `జెర్సీ` ద్వితీయార్థంలో దాదాపు సగం వరకూ క్రికెట్ మ్యాచ్ సీన్లే ఉంటాయి. దిల్ రాజు కత్తెర పట్టుకోకపోతే.. అవి ఇంకాస్త పెరిగేవి.