గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వాకం మీద రాజకీయ పార్టీలు ఇప్పటికే స్పందించిన విషయం, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాలతో పాటు కాంగ్రెస్ జనసేన పార్టీలు కూడా నిరసన కార్యక్రమాలు చేశాయి. పవన్ కళ్యాణ్ ఈ సమస్య మీద స్పందిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం –
” తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చడం దారుణం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లింపు దగ్గర నుండి ఫలితాలు విడుదల వరకు ప్రతి అంశం మీద విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసి ఈ నిజాలు వెల్లడించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థుల మీద వారి తల్లిదండ్రుల మీద ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుదాడికి దిగడం ఖండిస్తున్నాను. విద్యార్థులందరికీ ఉచితంగా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయించాలి. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా పరిహారం ఇప్పించాలి. ఇన్ని అవక తవకలకు ఇన్ని అనర్థాలకు కారణం అయిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల మీద, సాఫ్ట్వేర్ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా న్యాయవిచారణకు ఆదేశించాలని ” అంటూ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థుల తరపున జనసేన పోరాటం చేస్తుందని, విద్యార్థులు ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోరాదని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ విద్యార్థుల సమస్య మీద వైఎస్సార్సీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు ఇంకా స్పందించాల్సి ఉంది.