బ్యాంక్ బంగారం తరలిస్తున్నప్పుడు.. టీటీడీ అధికారులు ఎందుకు లేరు..?. బంగారం వాహనం… హైవే మీదుగా రాకుండా వేరే దారుల్లో ఎందుకు వస్తోంది..?. టీటీడీ బంగారాన్ని ఈసీ అధికారులు పట్టుకున్న ఘటనపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదు..?.. ఇవీ టీటీడీకి చెందిన బంగారాన్ని.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు తరలిస్తున్న వివాదంపై.. విజయసాయిరెడ్డికి వచ్చిన డౌట్లు. బంగారాన్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌దేనని.. వాళ్లు ఎలా తీసుకొస్తారో.. తమకు అనవసరం అని టీటీడీ చెబుతోంది. వాళ్లు తీసుకొచ్చి.. టీటీడీ ఖజానాకు జమ చేసినప్పుడు మాత్రమే.. బంగారం స్వాధీనం చేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు… స్వాధీనం చేసే వరకూ.. బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ దే అవుతుంది. అప్పుడు టీటీడీ అధికారులు.. ఆ బ్యాంక్ వెంట.. ఆ బంగారం వెంట ఎందుకుంటారో విజయసాయిరెడ్డికే తెలియాలి.
డిపాజిట్ గడువు తీరిన బంగారాన్ని పీఎన్బీ.. టీటీడీకి అప్పగించే క్రమంలో ఈసీ అధికారులు పట్టుకున్నారు. సరైన పత్రాలు చూపించలేదన్న కారణంగా స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజు తర్వాత పత్రాలు చూపించడంతో విడుదల చేశారు. బ్యాంక్ అధికారులు.. దాన్ని తీసుకొచ్చి టీటీడీ ఖజానాలో జమ చేశారు. ఇదో పెద్ద వివాదం అయినట్లుగా.. ఈసీ నియమించిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం … విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా.. మన్మోహన్ సింగ్ ను నియమించారు. ఆయన విచారణ జరిపి.. నివేదికను… సీఎస్‌కు ఇస్తున్న సమయంలోనే.. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. గందరగోళమైన ఆరోపణలు చేశారు. టీటీడీ ఈవోకు ఎలా పోస్టింగ్ వచ్చిందో.. మన్మోహన్ సింగ్ విచారణ చేయాలనే వింత డిమాండ్ ను కూడా విజయసాయిరెడ్డి చేశారు. మన్మోహన్‌సింగ్ విచారణ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
నెల రోజుల్లో అధికారం తమదే అంటున్న విజయసాయిరెడ్డి… ఇప్పుడు.. ఎందుకు అంతగా విమర్శలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికారం అందుతుందన్న కాన్ఫిడెంట్ ఉంటే.. నెల రోజుల తర్వాత.. వాటిపై నేరుగా విచారణ జరిపించుకోవచ్చు కదా.. అనే సెటైర్లు సోషల్ మీడియాలో పడుతూనే ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా… అర్థం పర్థం లేని ఆరోపణలతో… అసభ్యమైన పదాలతో.. అధికారపక్షంపై దాడి చేసి.. ఏం రాజకీయం చేస్తారన్న కామెంట్లు.. ఇతరుల నుంచి వస్తున్నాయి. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. ఆయన పంధాలో ఆయన వెళ్తున్నారు.