మహేష్‌బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మహర్షి తరవాత… పట్టాలెక్కబోయే మహేష్ సినిమా ఇదే. ఇందులో విజయశాంతి ఓ కీలకపాత్ర పోషించబోతోందన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి చేయదగ్గ ఓ శక్తిమంతమైన పాత్ర ఉన్న మాట వాస్తవమే. ఆ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించిన మాటా నిజమే. కాకపోతే.. ఇప్పటి వరకూ రాములమ్మ ఈ సినిమాకి ఓకే చెప్పలేదని టాక్. సినిమా ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం ఉంది కాబట్టి, విజయశాంతి తన నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టిందని తెలుస్తోంది.
ఒకవేళ చివరి నిమిషంలో విజయశాంతి కాదంటే ఏమిటి? అనే సందిగ్థంలో ఉంది చిత్రబృందం. అందుకే తగినన్ని ఆప్షన్లు రెడీ చేసుకొంటోంది. రమ్యకృష్ణ, జయప్రదలలో ఎవరినో ఒకరిని ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తోంది. విజయశాంతి నో చెప్పిన పక్షంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వడం ఖాయం. రమ్యకృష్ణ టీమ్‌లోకి రావడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. పాత్ర నచ్చితే తాను ఓకే అంటుంది. పైగా రమ్య నటించడం కొత్తగానూ ఏం ఉండదు. రమ్యకృష్ణ కంటే జయప్రద మంచి ఆప్షన్ అన్నది అనిల్ రావిపూడి నమ్మకం. అయితే జయప్రద ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉంది. వాటి నుంచి బయటకు రావడానికి తనకు కాస్త సమయం పడుతుంది. విజయశాంతి తప్పకుండా తమ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందని, కాని పక్షంలో అప్పుడు మరో ఆప్షన్ గురించి ఆలోచిద్దామని అనిల్ రావిపూడి చెబుతున్నాడట. మరి ఏం జరుగుందో చూడాలి.