ఓ వైపు సీఎస్ రాజకీయ అజెండాతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూండటం.. మరో వైపు.. టీడీపీ నేతలు కోడ్ ఉన్నప్పటికీ సమీక్షలు చేస్తామని సవాళ్లు చేస్తూండటంతో… ఉన్నతాధికారులు .. తమకు ఎందుకొచ్చిన తిప్పలని మధ్యేమార్గాన్ని ఎంచుకుంటున్నారు. సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా ఉన్న గిరిజా శంకర్ సెలవు పెట్టి వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తిరిగిరానున్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర కూడా అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. సీఎస్ కేబినెట్ నిర్ణయాలను కూడా ప్రశ్నిస్తూ ఉండటంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఆయన సెలవు పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే… తర్వాతైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశం ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబును అంటిపెట్టుకుని తిరిగిన మరో కీలక అధికారి కూడా సెలవుపై వెళ్లిపోయారు. ఆయన తన స్వరాష్ట్రానికి విశ్రాంతి కోసం వెళ్లానని చెబుతున్నారు. కానీ అసలు కారణం మాత్రం అందరికీ తెలిసిందే. మరి కొన్ని కీలక శాఖల అధికారులు కూడా సెలవుపై వెళ్లిపోయారు. ఇంకొంతమంది అసలు సెక్రటేరియట్ వైపు కూడా తిరిగి చూడటంలేదు. విధుల్లో ఉన్నవారు.. పని చేసేందుకు వెనుకాడుతున్నారు. ఏ ఫైల్ పై సంతకం పెడితే ఎటువంటి మెమోలు వస్తాయోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. మరో వైపు ఎల్వీకి మద్దతుగా నేరుగా.. సీఎంపైనే.. విమర్శలను.. ఐఏఎస్ అధికారులతో చేయించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఇందు కోసమే ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ 184 మంది ఐఏఎస్ అధికారులుండగా 14 మంది మాత్రమే వచ్చారు. సమావేశానికి వచ్చిన వారికి… వైసీపీ గెలిచిన తర్వాత ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కుతాయని ప్రచారం చేసినప్పటికీ..ఎవరూ రావడానికి ఆసక్తి చూపించలేదు.
పాలకపక్షం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య అంతరం బాగా పెరిగిపోవడంతో అధికారులు ఎక్కువమంది వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అకాల వర్షాలు.. ఎండలు… వంటి వాటిపై.. సమీక్షలు చేసి.. ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై.. ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి అనుకున్నా… అధికారులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. కౌంటింగ్ ముగిసేవరకూ… ఏపీలో ఒక్క పనీ జరగదని.. తాజా పరిణామాలతో తేలిపోయింది.