కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి గత వారం రోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే! ఆయనపై నమోదైన కేసు విషయంలో ముందస్తు బెయిల్ కావాలంటూ నాంపల్లి కోర్టును కొండా ఆశ్రయించారు. అయితే, కొండా ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు నిరాకరించింది. ఒక ఎస్సై, కానిస్టేబుల్ నిర్బంధించారంటూ అభియోగం ఎదుర్కొంటున్న కొండా… పోలీసు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది. గడచిన వారం రోజులుగా బంజారాహిల్స్ స్టేషన్ పోలీసులు కొండా కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ను కోర్టు తోసిపుచ్చడంతో ఇప్పుడాయన విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.
అయితే, తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపిత చర్యగానే కొండా విశ్వేశ్వరరెడ్డి చెబుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచీ అధికార పార్టీ తెరాస కక్షసాధింపులకు దిగుతోందనీ, ఈ క్రమంలోనే తప్పుడు కేసు పెట్టారంటూ ఆయన అంటున్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే… ఎన్నికలకు ముందు కొండా అనుచరుడి దగ్గర రూ. 10 లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన నోటీసులు అందించడం కోసం ఎస్సైతోపాటు, హెడ్ కానిస్టేబుల్ కొండా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొండాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చిన పోలీసు పట్ల అసభ్యంగా వ్యవహరించారనీ, విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసుల్ని నిర్బంధించారనేది కొండాపై అభియోగం. కొండా ఇంటికి వెళ్లి ఎస్సై, హెడ్ కానిస్టేబుల్.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఒక కేసు పెట్టారు. అయితే, ఈ కేసు విచారణ కోసం కొండాకి నోటీసులు ఇచ్చారనీ, కానీ ఆయన విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారనేది బంజారాహిల్స్ పోలీసులు చేస్తున్న ఆరోపణ.
రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పోలీసులను ఉపయోగించుకుని తనని నిర్బంధించాలని తెరాస చేస్తోందనేది కొండా వాదన. ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి కొండా తరఫు లాయర్ తీసుకెళ్లారు. అయితే, పోలీసులపై అసభ్యంగా వ్యవహరించారని వారి తరఫు లాయర్ వాదనలు వినిపించడంతో కొండా ముందస్తు బెయిల్ దరఖాస్తును నాంపల్లి కోర్టు నిరాకరించింది. దీంతో కొండా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ కొండా ఎక్కడున్నారనేది తెలీడం లేదు! కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరౌతారా లేదా అనేది చూడాలి.