తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంపై ఇంకా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రీ వెరిఫికేషన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినా… నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రగతి భవన్ వద్ద జనసేన కార్యర్తలకు నిరసనకు దిగారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోపక్క, ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఐద్వా కార్యకర్తలు కూడా నిరసన చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ అలసత్వాన్ని తప్పుబడుతున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలనను గాలికి వదిలేశారనడానికి ఇదే సాక్ష్యమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ… తెలంగాణలో ఇంటర్ పరీక్షలను కూడా అక్కడి ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇంటర్ ఫలితాల నేపథ్యంలో అక్కడి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తే… ఎవ్వరూ నోరు మెదపడం లేదనీ, కానీ తాను ఏపీలో రోజువారీ పాలనలో భాగంగా సమీక్షలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున విమర్శలు చేసే పరిస్థితి ఉందన్నారు. తాను సమీక్షలు చేస్తుంటే నానా యాగీ చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ఇష్టానునసారంగా వ్యవహరిస్తే పరిపాలన అస్తవ్యస్థంగా మారుతుందని చంద్రబాబు అన్నారు.
అధికార దాహంతో ఏపీలో ఎన్ని అరాచకాలు చెయ్యాలో అన్నీ వైకాపా చేసిందనీ, వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టామన్నారు సీఎం. ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా, విమర్శలు చేస్తున్నా టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈవీఎంల పనితీరుపై చేస్తున్న పోరాటం ఇప్పటికాదనీ, దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయా పార్టీలు కూడా ఈ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. గడచిన ఐదేళ్లుగా అధికారులు తనకు ఎంతగానో సహకరించానీ, కానీ ఇప్పుడు అధికారుల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనీ, వాటి కోసం టీడీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు చంద్రబాబు చెప్పారు.