ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అకస్మాత్‌గా ఢిల్లీకి వెళ్లారు. ఇసుక తవ్వకాల కేసు విషయంలో.. ఎన్జీటీ ముందు హాజరవడానికి అని ..అధికారికంగా సమాచారం ఇచ్చినా.. అసలు విషయం మాత్రం.. వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఏపీలో ప్రభుత్వాన్ని లెక్క చేయడం లేదు. తానే ప్రభుత్వం అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న కేబినెట్ నిర్ణయాలను సైతం సమీక్షించడం దగ్గర్నుంచి రకరకాల వివాదాస్పద వ్యవహారాలను.. చక్క బెడుతున్నారు. చివరికి.. ఎన్నికల ప్రధాన అధికారి.. గోపాల కృష్ణ ద్వివేదీ నిర్వహించాల్సిన ఎన్నికల అధికారాలను కూడా ఆయనే చెలాయిస్తున్నారు.
కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష చేయడం… దుమారం రేపుతోంది. సీఈవో చేయాల్సిన పని ..సీఎస్ ఎలా చేస్తారన్న అభిప్రాయం.. రాజ్యాంగ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని… టీడీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికైన ప్రజాప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఎన్నికల కోడ్ పేరుతో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంపై .. మండి పడుతున్నారు. ఈ తరుణంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం హఠాత్తుగా.. ఢిల్లీ వెళ్లడంతో.. అందరి చూపు అటు వైపు పడింది. అక్కడ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎవరెవర్ని కలుస్తారన్న అంశంపై రహస్యంగా ఉంచారు. మామూలుగా అయితే.. ఆయనకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎలాంటి అధికార విధులు ఉండవు కాబట్టి.. ఈసీని కలవాల్సిన అవసరం లేదు.
అయితే.. ఎల్వీ నియామకం దగ్గర్నుంచి అంతా ఓ పద్దతి ప్రకారం.. ఏపీలో టీడీపీని ఇబ్బంది పెట్టే వ్యవహారం నడుస్తోందన్న అనుమానాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన బీజేపీ పెద్దలతో రహస్యంగా భేటీ అయి… ఈ నెల రోజుల్లో ఏం చేయాలన్న దానిపై… సలహాలు, సూచనలు తీసుకుని వస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎస్ అటు ఢిల్లీ వెళ్లగానే.. ఇటు టీడీపీ నేతలు.. ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఎల్వీ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎల్వీ ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నదానిపై.. ఢిల్లీలో ఏం జరిగిందన్నదానిపై ఓ అంచనాకు రాజకీయవర్గాలు వచ్చే అవకాశం ఉంది.