టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. రెండేళ్ల కిందట నమోదు చేసిన కేసు విషయంలో.. తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ బెంగళూరు బ్రాంచ్ సూచించింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ అనే కంపెనీ వ్యవహారంలో రూ. 71 కోట్ల రూపాయల మేర ఆంధ్రాబ్యాంక్ ను సుజనా చౌదరి మోసం చేసినట్లు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ కేసు నాలుగైదేళ్ల నుంచి నడుస్తోంది.ఈ కేసులో.. సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణ్ రావుపై మొదట కేసు నమోదయింది. ఈయనే బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అంతకు ముందు ఆయన సుజనా చౌదరి కంపెనీల్లో కీలక బాధ్యతల్లో ఉండేవారు.
బెస్ట్ అండ్ క్రాంప్టన్ … బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించలేదు. అయితే బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అసలు యజమానులను గుర్తించడానికి దర్యాప్తు సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ సంస్థ సుజనాచౌదరిదేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇది కూడా.. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కేసులో తీసుకున్నచర్యే. సీబీఐ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ఈడీ వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.
2010-2013 మధ్య కాలంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల నుంచి చెన్నైలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ సంస్థ రూ.364 కోట్లకు మోసం చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. డొల్ల కంపెనీలను సృష్టించి బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మళ్లించినట్లు సీబీఐ చెబుతోంది. ఈ కేసులోనే సుజనా చౌదరిని విచారణకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. గతంలోనూ ఈడీ అధికారులు సుజనా చౌదరిని చెన్నైలో విచారించారు. ఈ విచారణ ప్రక్రియ ఇలా సాగుతూనే ఉంది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ సుజనా చౌదరిదేనని తేలితే.. సీబీఐ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.