” అన్నీ పరిశీలిస్తున్నా… కానీ నా అభిప్రాయం బయటకు చెప్పలేను..!” పార్టీ ఫిరాయింపుల అంశం.. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై… కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నప్పుడు… నరసింహన్ వ్యక్త పరిచిన స్పందన ఇది. ఫిరాయింపుల నిరోధానికి గవర్నర్ చొరవచూపాలని భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని లేకుండా చేయాలనుకోవడం దారుణమని.. భట్టి విక్రమార్క గవర్నర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందనగా గవర్నర్ అన్ని విషయాలు గమనిస్తున్నా.. అభిప్రాయాలు బయటకు చెప్పలేనని వారికి సమాధానం ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై తర్వాత స్పందిస్తానని కవర్చేశారు. ఈ సందర్భంగా.. షబ్బీర్ అలీ, గవర్నర్ మధ్య ఆసక్తికర సంభాషణజరిగింది. మీ వద్ద ఉన్న అస్త్రాన్ని బయటకు తీయాలని షబ్బీర్ అలీ గవర్నర్ ను కోరారు. అయితే.. నరసింహన్ మాత్రం.. తన దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవు… కానీ కలం మాత్రం ఉందని చెప్పుకొచ్చారు.
రేపోమాపో… సీఎల్పీని .. టీఆర్ఎల్పీలో విలీనం చేయడానికి.. కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో… గవర్నర్ స్పందన కాస్త ఆశ్చర్యం రేకెత్తించేలా ఉందని.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో టీఆర్ఎస్ విషయంలో ఏమీ పట్టనట్లు ఉండేవారు. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం గమనిస్తున్నానని.. తర్వాత స్పందిస్తానని చెప్పడం.. కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురించేలా చేసింది. కానీ.. ఆయన ఎలాంటి చర్యలైనా తీసుకుంటారనే ఆశలు మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలే.. మళ్లీ సమాధానపడ్డారు.
కాంగ్రెస్ సహా.. వివిధ పార్టీల నేతలందరూ.. గవర్నర్ ను…ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు కలిశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని..కోరారు. విద్యార్థుల ఆత్మహత్యలపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఇప్పటికే గవర్నర్ ఇంటర్ బోర్డు అధికారులతో కూడా సమావేశమయ్యారు. వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు వివాదం ఎదుర్కొంటున్న గ్లోబరీనా సంస్థపై… గతంలో విచారణకు గవర్నర్ ఆదేశించారు. ఇప్పుడు.. ఏం చర్య తీసుకుంటారోనన్న ఆసక్తి… అఖిలపక్ష నేతల్లో వ్యక్తమయింది. ఉత్తమ్, కోదండరాం, రావుల, పల్లా వెంకట్రెడ్డి గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.