దేశచరిత్రలో తొలిసారిగా నలుగురు జడ్జీలు మీడియా ముందుకు వచ్చి, పెద్ద ఎత్తున విమర్శలూ ఆరోపణలూ చేస్తూ సంచలనం సృష్టించిన కేసు ఏ స్థాయిలో ఉందో… ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిపై వేధింపుల ఆరోపణల వ్యవహారం కూడా అంతే చర్చనీయంగా మారుతోంది. జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది. దీని కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐతోపాటు, ఐబీ డైరెక్టర్లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్లను పట్నాయక్ కు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈకేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం… స్వతంత్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
దేశంలో అత్యున్నతమైన ఛీఫ్ జస్టిస్ పదవిని కూడా అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఓపక్క విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఉద్యోగం నుంచి తొలగించారన్న కారణంతో ఒకామె ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఒకవేళ గొగోయ్ లైంగిక వేధింపులకు గురిచేస్తే… ఆధారాలతో నేరుగా మీడియా ముందుకు రావొచ్చు, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. అంతేగానీ, ఆమె ఏకంగా అందరి న్యాయమూర్తులకీ ఇతర విభాగాలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమె వెనక ఎవరో ఉన్నారనీ, లేదంటే ఇంత పెద్ద ఎత్తున పకడ్బందీ వ్యూహంతో ఇలా వ్యవహరించేవారు కారనే అభిప్రాయాలూ కొన్ని వ్యక్తమౌతున్నాయి.
అయితే, గొగోయ్ పై ఈ ఆరోపణల వెనక ఓ పెద్ద కుట్ర కోణం ఉందంటూ ఓ న్యాయవాది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ కుట్రలో భాగమే ఈ ఆరోపణలని అంటున్నారు. కేష్ ఫర్ జడ్జిమెంట్ వ్యవహారాన్ని గొగోయ్ అడ్డుకున్నానీ, కాబట్టి ఆయన్ని ఎలాగోలా తప్పించాలనేది ఈ కుట్ర వెనక ఉన్న కొంతమంది ఉద్దేశమని ఆ న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఎప్పుడో డిసెంబర్ లో ఉద్యోగం నుంచి తొలగించిన మహిళ… ఇన్నాళ్లూ మౌనంగా ఉండి, ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఆరోపణలు చేస్తున్నారంటే దీని వెనక వేరే కోణం కచ్చితంగా ఉందనేది ఆయన అభిప్రాయం. కోర్టు తాజా ఆదేశాలతో ఈ కుట్ర కోణంపై విచారణ మొదలైందనే చెప్పాలి. మొత్తానికి, ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయం అవుతోంది.