ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం… ముఖ్యమంత్రిలా ఫీలైపోతున్నారు. తన దగ్గరకే ముఖ్యమంత్రులు, మంత్రులు రావాలన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఆయన ఓ అండ చూసుకుని అలా రెచ్చిపోతున్నారని అందరికీ తెలుసు. ఎంత అండ ఉంటే మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడం కరెక్టేనా..? రాజ్యాంగానికి అతీతంగా ప్రకటనలు చేయడం కరెక్టేనా..? అండగా ఉండేవాళ్లు ఉంటే సర్వీస్ రూల్స్ పట్టించుకోవాల్సిన పని లేదా..?
ఎన్నికల కోణంలో మాత్రమే నియమితుడైన అధికారి ఎల్వీ..!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి.. కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలు… స్వేచ్చగా, నిజాయితీగా జరిపేలా.. ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కొన్ని అధికారాలు కల్పించింది. దాని ప్రకారం… ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈసీ అధీనంలోకి వస్తుంది. ఈ మేరకు ఈసీ తన విచక్షణ మేరకు.. ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించుకుంటుంది. బదిలీలు చేస్తుంది. అయితే.. ఈ బదిలీలన్నీ… ఎన్నికల నిర్వహణ కోణంలోనే ఉంటాయి తప్ప.. రోజువారీ పాలనా వ్యవహారాలు.. ఎన్నికలకు సంబంధం లేని అంశాల విషయంలో ఉండవు. అంటే.. ఫలానా అధికారి వల్ల ఎన్నికల నిర్వహణ ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగదు అనుకుంటే బదిలీ చేయవచ్చు. ఏపీలో అలా పలువుర్ని బదిలీ చేసింది. కారణాలు చెప్పకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పడానికి లేకపోయింది. అలా చీఫ్ సెక్రటరీగా ఉన్న పునేఠాను కూడా బదిలీ చేశారు. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించారు. అంటే.. ఆయనపై ఈసీ అనుమానపడినట్లే. కొత్త సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించారు. ఎన్నికల విధుల కోసమే ఆయనను నియమించారు. ఎందుకంటే.. ఈసీకి ఉన్న పరిధి ఎన్నికల వరకే. కానీ.. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు.. తాను ముఖ్యమంత్రి కన్నా పవర్ ఫుల్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలను సమీక్షించే హక్కు చీఫ్ సెక్రటరీకి ఎవరిచ్చారు..?
రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం అత్యున్నతం. ఎవరైనా మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. కానీ… ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. కేబినెట్ నిర్ణయాలను విమర్శిస్తున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలపై.. అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఎల్వీ ఈ విధంగా వ్యవహరించడంతో.. అధికారుల్లోనూ కలకలం రేగింది. ఎన్నికల ప్రధాన అధికారి.. విధుల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం . ఎస్పీలు, పోలింగ్‌తో ప్రత్యక్ష సంబంధముండే అధికారులు, సిబ్బంది మొత్తం నేరుగా సీఈవో పర్యవేక్షణలోకి వెళతారు. కానీ సీఎస్ ఈ అధికారాల్ని టేకోవర్ చేశారు. ఇది పూర్తిగా జరిగిన రాజ్యాంగ ఉల్లంఘన.
కోడ్ ఉంటే సీఎస్.. సీఎం అయిపోతారా..? ఎవరిని చూసుకుని చెలరేగిపోతున్నారు..?
ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి.. తానే ముఖ్యమంత్రిని అన్నట్లుగా పరిపాలన సాగించేస్తున్నారు సీఎస్. సీఎంకు సమాచారం లేకుండా సమీక్షలు చేసేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి.. తనకు అధికారం ఉందని చెబుతున్నారు. కోడ్ వస్తే.. ఉండేది ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నట్లుగా సీఎస్ మాట్లాడుతూండటంతో.. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు పాలించడానికి 2014లో ప్రజలు తీర్పు ఇచ్చారు. దాని ప్రకారం.. ఏపీ ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు అధికారం ఉంటుంది. అన్ని రకాల పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏపీలో ఇప్పుడు పూర్తి స్థాయి ప్రభుత్వం ఉంది. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల కొన్ని పరిమితులు ఉంటాయి. ఎన్నికలను ప్రభావితం చేయనంత వరకూ సమీక్షలు నిర్వహించుకోవచ్చు. ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న వారు మాత్రమే ఈసీ పరిధిలో ఉంటారు. మిగతా వారంతా ప్రభుత్వం కిందనే పని చేయాలి. కానీ.. కోడ్‌కు విస్తృతార్థం తీసుకున్న సీఎస్.. ఏపీలో ఉన్న ఆపద్దర్మ ప్రభుత్వం అన్నట్లుగా మాట్లాడి.. సీఎంకు తెలియకుండానే సమీక్షలు చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రభుత్వానికే హక్కులు లేకుండా రాజ్యాంగాన్ని పరిహసిస్తున్నారా..?
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉండగానే.. కోడ్ పేరుతో ఇష్టారాజ్యం నడుస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రులు సమీక్షలు పెట్టకూడదన్న ఈసీ కూడా.. ఇప్పుడు… తన వాదనను సమర్ధించుకోవడానికి తంటాలు పడాల్సి వస్తోంది. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ.. ప్రధానమంత్రి మోదీ.. కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. కేబినెట్ భేటీ నిర్వహించడం తప్పు కానప్పుడు.. ఎన్నికలు అయిపోయిన ఏపీలో పాలనాపరమైన సమీక్షలు నిర్వహిస్తే తప్పేమిటో.. ఈసీ కూడా చెప్పలేకపోతోంది. ఏపీలో ఇప్పుడు ఓ రకంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. దీనికి బాధ్యులెవరు..?