తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేయాల్సిన సమయం వచ్చిందనేది హైకమాండ్ అంచనాగా తెలుస్తోంది..! ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవుల్లో మార్పులు తప్పవనే చర్చ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దాన్నుంచి కోలుకుని కనీసం లోక్ సభ ఎన్నికల్లోనైనా తెరాసకు ధీటుగా నిలబడ్డ పరిస్థితి ఉందా అంటే… అదీ అనుమానమే అనేది కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందిగానీ… ఆ ఫలితాల్లో పార్టీ అనూహ్యమైన విజయాన్ని దక్కించుకుంటుందనో, లేదా అధికార పార్టీ తెరాసకు ధీటైన పోటీ ఇచ్చిందన్న అభిప్రాయమో సొంత పార్టీ వర్గాలకే లేకపోవడం గమనార్హం! దీంతో, కనీసం మరో ఐదేళ్లకైనా పార్టీని గాడిలో పెట్టాలంటే ఇప్పట్నుంచే ప్రక్షాళనపై దృష్టి పెట్టాలనేది హైకమాండ్ ఉద్దేశంగా తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే… తెలంగాణ[ కాంగ్రెస్ లో కీలక మార్పులు తప్పవనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మొదలుకొని కీలక పదవులన్నింటా కొత్తవారు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి విషయమై ప్రస్తుతం రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపుకోసం ఆయన ఒక్కరే బాగా కష్టపడ్డారనీ, ఇతర నేతలు పోటీలో ఉన్నా కూడా ఎన్నికల్ని కాస్త లైట్ తీసుకున్నారనే అభిప్రాయం హైకమాండ్ కి కలిగిందట! పైగా, తెరాసపై గట్టిగా పోరాటం చేయాలంటే రేవంత్ చేతిలోనే పార్టీ పగ్గాలుంటేనే మంచిదని భావిస్తున్నారట!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జీవన్ రెడ్డికి కూడా పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందనీ తెలుస్తోంది. వాగ్ధాటితో తెరాసను ఎదుర్కోవడంలో ఆయన సేవలు కూడా పార్టీకి కీలకం అవుతాయని హైకమాండ్ భావిస్తోందట! ఎన్నికల్లో ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహించిన విజయశాంతికి కూడా కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందట. ఎందుకంటే, రాబోయే తెరాసను ఎదుర్కొంటూ, పార్టీ కేడర్ కి భరోసా పెంచాలంటే ఇలాంటి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకులకి బాధ్యతలు అప్పగించాలన్నది అధిష్టానం వ్యూహంగా తెలుస్తోంది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలకు పదవీ గండం తప్పదనే చర్చ టి. కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.