ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు ఎండలు మండి పోతూంటే… మరో వైపు తుపాను ముంచుకొస్తోంది. ఎండల కారణంగా.. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఏర్పడింది. ప్రభుత్వం వైపు నుంచి సరైన చర్యలు లేవు. దిశానిర్దేశం చేసే అధికారులు లేరు. చీఫ్ సెక్రటరీ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కానీ.. అసలైన ప్రజాసమస్యల విషయంలో చర్యలు తీసుకునేందుకు మాత్రం ఆయన సమయం కేటాయించడం లేదు. ఏపీ ప్రజల్ని పట్టించుకోవడం లేదు…! పట్టించుకోనివ్వడం లేదు..!
పోలింగ్ ముగిసినా ప్రజలపై ఈ కక్ష ఎందుకు..?
ఎన్నికల కోడ్ అనేది ఓటర్లను ప్రభావితం చేయకుండా ఏర్పాటు. ఓటింగ్ పూర్తయి.. తీర్పు ఈవీఎంలలో ఉన్న తర్వాత ఈ కోడ్ పేరుతో.. పాలన లేకుండా చేయడం దుర్మార్గం. ఏపీలో ఓ వైపు కరవు.. మరో వైపు తుపాను ఏపీని ఇబ్బంది పెడుతున్నా… కోడ్ రాజకీయం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో… ప్రభుత్వ అధికారులెవరికీ ఆదేశాలు జారీ చేయడానికి ముఖ్యమంత్రికి అధికారం లేదని… సీఈవో ద్వివేదీ … స్పష్టం చేశారు. చివరికి ఇంటలిజెన్స్ బాస్‌ని కూడా.. సీఎంకు రిపోర్ట్ చేయవద్దని ఆదేశించారు. దీంతో నేరుగానే.. చంద్రబాబును పని చేయవద్దని చెప్పినట్లయింది. మరో వైపు.. ఐఏఎస్ అధికారుల్లో గ్రూపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కొత్త ప్రభుత్వం వస్తే.. ప్రాధాన్యత కల్పిస్తామని.. కొంత మంది ఐఏఎస్ అధికారులను ప్రలోభపెట్టి.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ కారణాలతో అనేక మంది అధికారులు…ఈ తలనొప్పి మాకెందుకంటూ.. సెలవులు పెట్టి వెళ్లిపోయారు. కోడ్ ఉందన్న కారణంగా అసలు మంత్రి వర్గ ఉనికిని గుర్తించడానికి సీఎస్ సిద్దంగా లేరు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని నిలిపివేయడం మానవత్వమేనా…?
ఏపీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని కూడా నిలిపివేశారు. ఈ చెక్కులు ఎలా జారీ అవుతాయో అధికారులకు తెలియనిది కాదు. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత.. అన్ని బిల్లులు పరిశీలించిన తర్వాతే.. ఇవి మంజూరవుతాయి. అయినా… చెక్కులు బౌన్స్ అయ్యేలా చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఆగాలని.. సీఎస్ చెబుతున్నారు. ఇక ఇతర పథకాల గురించి అయితే ఆలోచించాల్సిన పని లేదు. పూర్తిగా నిలిపివేశారు. కర్ణాటకలో పోలింగ్ ముగిసినందున.. అక్కడ ఎన్నికల కోడ్‌ను.. ఈసీ సడలించిందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఏపీ ముఖ్యమంత్రి పరిస్థితులన్నిటినీ వివరిస్తూ.. లేఖ రాసినా… దానిపై ఈసీ వర్గాలు ఇంత వరకూ నోరు మెదపలేదు. ప్రజలు ఎలాంటి కష్టాలు పడితే మాకెందుకు మాకు కావాల్సింది రాజకీయమే అన్నట్లుగా ఉంది.. వ్యవహారశైలి.
తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఆంక్షలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదా..?
ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి.. ప్రతిపక్ష వైసీపీ చేసిన ఫిర్యాదులపై… ఎన్నికల సంఘం.. శరవేగంగా స్పందించింది. గంటల్లోనే చర్యలు చేపట్టింది. ఏకంగా.. చీఫ్ సెక్రటరీతో పాటు ఎస్పీలనూ బదిలీ చేసింది. నిజానికి వైసీపీ చేసేవి నోటిమాటలుగా ఉండే ఆరోపణలే. ఆ ఆరోపణలతో బదిలీ చేస్తే.. విమర్శలు వస్తాయని… కారణాలు చెప్పాల్సిన అవసరం లేదని వాదించుకుని బదిలీ చేసేసింది. అదే సమయంలో.. టీడీపీ కనీసం.. 150 ఫిర్యాదులు చేసింది. ఒక్కటంటే.. ఒక్క దానిపైనా.. ఈసీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చివరికి వైసీపీ.. టీడీపీ అధినేత.. తన నివాసంలో టీడీపీ అభ్యర్థులతో సమీక్ష చేసుకున్నా.. వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే స్వీకరించారు. కానీ.. టీడీపీ అధినేత నేరుగా.. లేఖ రాసినా మాత్రం స్పందన రావడం లేదు. కోడ్ పేరుతో అధికారులు.. ప్రజాసమస్యలపై.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కోడ్ పేరుతో.. సర్వాధికారాలు అనుభవించేందుకు ప్రయత్నిస్తూ..రాజ్యాంగానికి తమదైన భాష్యం చెబుతున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.