తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఈ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారనీ, అందుకే అన్ని చోట్లా జెండాలు ఎగరేసి, పార్టీ కోసం పాటుపడిన వారందరినీ మెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు, జెడ్పీ ఎన్నికలు ఉన్నాయనీ, వాటిలో కూడా తెరాస ఘన విజయం సాధించాలనీ, ఆ తరువాత పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుందామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ గురించి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమాన్ని స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయ పార్టీలు వాడుకుంటాయనే ఒక భావన నాడు ప్రజల్లో ఉండేదనీ, దాన్ని పూర్తిగా మార్చి, రాజకీయ పోరాట పంథాలోనే రాష్ట్రం సాధించగలమనే భరోసా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కల్పించారన్నారు. తెలంగాణ సాధన పంథా నుంచి తాను పక్కకి మళ్లుతుంటే… రాళ్లు పట్టుకొని కొట్టే అధికారం ప్రజలకు ఉంటుందని చెప్పిన ఘనత కేసీఆర్ ది అన్నారు.
టీడీపీ స్థాపించిన నాటికి ఎన్టీఆర్ కి కొన్ని అనుకూలతలు ఉన్నాయనీ, అప్పటికే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందనీ, ఆయన అప్పటికే పేరున్న గొప్ప పేరున్న నటుడనీ కేటీఆర్ చెప్పారు. కానీ, కేసీఆర్ పార్టీ స్థాపించే నాటికి ఆయనకు అలాంటివేవీ లేవనీ, అన్నీ తట్టుకుని క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వచ్చి, ప్రజల కలను సాకారం చేశారన్నారు. ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేదానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయని విమర్శించారు. ఈరోజు తెరాస సాధిస్తున్న విజయాలను చూసి కన్నుకుట్టినవారు చాలామంది ఉన్నారని అన్నారు. తెరాసను ఇరికించేందుకు ఎక్కడైనా ఛాన్స్ వస్తుందేమో అని గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయన్నారు. కానీ, ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనీ, ఒక సమర్థుడైన నాయకుడు, చాణక్యుడు మనకు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా లభించడం మన అదృష్టం అన్నారు. చిన్నచిన్న పొరపాట్లు జరిగినా కూడా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోదామని పార్టీ వర్గాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సొంత రాష్ట్రం సాధించుకున్నామనీ, ఇప్పుడు దాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దామని కేటీఆర్ చెప్పారు.
ప్రతిపక్షాలను చూసి తెరాస శ్రేణులు టెన్షన్ పడొద్దంటూ కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది! ఎందుకంటే, ప్రతిపక్షమంటూ ఏదీ లేకుండా చేయాలన్న ప్రయత్నంలో ఉన్నది వారే కదా! అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్ని వరుసపెట్టి తెరాసలోకి వలేసి గుంజుతున్నారు. చివరికి సీఎల్పీని కూడా తెరాస ఎల్పీలో విలీనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతుంటే… ఇక ప్రతిపక్షాలను చూసి తెరాస శ్రేణులు టెన్షన్ పడే పరిస్థితి ఎక్కడుంటుంది..? తెరాసను ఇరికించే స్థాయిలో ప్రతిపక్షాలు ఇక్కడున్నాయా..?