వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ ని టార్గెట్ గా చేసుకొని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నారనే మిష తో అసెంబ్లీకి వెళ్లడాన్ని కూడా బాయికాట్ చేసిన జగన్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అదేవిధంగా లాక్కుంటున్న కేసీఆర్ కు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మద్దతివ్వడాన్ని విజయశాంతి తప్పుపట్టారు. ఏపీలో తప్పయినది తెలంగాణలో ఎలా ఒప్పు అవుతుందో వైఎస్ జగన్ వివరణ ఇవ్వాలంటూ జగన్ ను ఇరుకున పెట్టేలా ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఇంతకీ కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇలా లాక్కోవడం జగన్ దృష్టిలో తప్పా ఒప్పా జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ విజయశాంతి చేసిన ట్వీట్ లకి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. విజయశాంతి చేసిన ట్వీట్ల వివరాలు ఇవి:
“చట్టసభల్లో స్పీకర్ పదవి అనేది చాలా ఉన్నతమైనది. అందుకే భారత రాజ్యాంగంలో న్యాయమూర్తులతో సమానమైన అత్యన్నత అధికారాలను స్పీకర్ పదవిలో ఉన్న వారికి ఆపాదించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయస్దానాలకు కూడా లేని రీతిలో రాజ్యాంగాన్నిపొందుపరచారు. ఇంత విశిష్టాధికారాలు ఉన్న స్పీకర్ పదవిలో ఉన్న వారు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కానీ ఇటీవల కాలంలో స్పీకర్ పదవిలో ఉన్న వారు అధికార పార్టీల ఒత్తిళ్లకు లోనవుతున్నారనే విమర్శలను ఎదుర్కోవలసి రావడం శోచనీయం.గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ తరపున ఎంత అరిచి గీపెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. గత అసెంబ్లీలో స్పీకర్ గా వ్యవహరించిన మధుసూధనాచారి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల అనుసరించిన వైఖరికి సంబంధించి, హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కూడా మరచిపోకూడదు. స్పీకర్ గా ఉన్నంత కాలం మధుసూధనాచారిగారు హైకోర్టు నోటీసులను పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పడు మాజీ స్పీకర్ గా ఆయన న్యాయస్ధానం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాము. స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరును ప్రతిపాదించినప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులందరూ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మద్దతు తెలిపిన విషయాన్నిఆయన గుర్తించాలి. ఈ విషయాన్ని మరచిపోయారో లేక మరే కారణమో తెలియదు కానీ కాంగ్రెస్ శాసనసభ్యులు స్పీకర్ పోచారం గారిని జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు కలవడానికి వెళ్లి, ఫిరాయింపులకు పాల్పడేవారిపై చర్య తీసుకోమని ఫిర్యాదు చేయడానికి వెళ్తే, కనీసం వారితో కలిసి ఫోటో దిగేందుకు కూడా ఆయన విముఖత చూపారన్న వార్తను చూసి, యావత్ తెలంగాణ సమాజం ఆశ్చర్యానికి గురైంది. అసెంబ్లీ స్పీకర్ గా అన్నీ పార్టీలను సమానంగా చూడాల్సిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అంటరాని వారిలా ప్రవర్తిస్తూ, వారితో కలిసి ఫోటో దిగేందుకు కూడా సిద్ధంగా లేరనే విషయం చూశాక ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అర్ధమవుతోంది. ఇప్పటికైనా పోచారం గారు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను సమానంగా చూస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాము. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ గారు చెబుతున్నారు. ఈ సందర్భంగా నేను జగన్ గారిని అడిగేది ఒకటే… వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించారనే కారణంతో గత రెండేళ్ల పాటూ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ఏపీలో పార్టీల ఫిరాయింపుపై తిరుగుబాటు చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలు పెడుతున్న కేసీఆర్ గారితో కలిసి, జాతీయ స్ధాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని జగన్ గారు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం. ఏపీలో తప్పైతే తెలంగాణలో ఎలా ఒప్పవుతుందో జగన్ గారు వివరణనివ్వాలి. కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం జగన్ గారి దృష్టిలో తప్పా, ఒప్పా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.”
మరి విజయశాంతి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ధైర్యం జగన్ కి ఉందా అన్నది వేచి చూడాలి. కనీసం సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే విజయసాయిరెడ్డి అయినా సమాధానం ఇవ్వగలడా అన్నది వేచి చూడాలి.