గతంలో స్వైన్ ఫ్లూ కారణంగా ముగ్గురు చనిపోతే, దానిని కారణంగా చూపించి దళితుడైన రాజయ్య ని మంత్రి పదవి నుంచి తప్పించిన కేసీఆర్.. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యా శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి ని ఎందుకు పదవి నుండి తప్పించరని ప్రశ్నించారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.
ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన మందకృష్ణ పలు ప్రశ్నలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంధించాడు. రాజయ్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు స్వైన్ ఫ్లూ కారణంగా చనిపోతే అప్పటికప్పుడు దళితుడైన రాజయ్య ని కేసీఆర్ మంత్రి పదవి నుంచి తప్పించాడని, కానీ అదే స్వైన్ ఫ్లూ కారణంగా రాజయ్య మంత్రి పదవి నుండి దిగిపోయిన తరువాత మరొక 15 మంది చనిపోతే ఒక అధికారి మీద కానీ ఒక్క మంత్రి మీద కానీ ఎటువంటి చర్య కేసీఆర్ తీసుకోలేదని మందకృష్ణ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా జగదీశ్వరరెడ్డి స్థానంలో ఎవరైనా దళితుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా వారి మీద కేసీఆర్ కత్తి వేటు పడి ఉండేదని, ఈ పాటికి మంత్రి పదవి పోయి ఉండేదని, కానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఎటువంటి చర్యలు లేవని మందకృష్ణ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా తప్పు అంతటిని ఇంటర్ బోర్డు మీదకు నెట్టేసి మంత్రివర్యుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.