తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు చిందరవందరగా ఉంది. గెలిచేసి అధికారం చేపడతామనుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. గత ఎన్నికల్లో పందొమ్మిది మంది కాంగ్రెస్ తరపున గెలిస్తే.. అందులో మెజార్టీ టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇంకా చేరుతారని.. ముగ్గురో నలుగురో ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారన్న ప్రచారం… గట్టిగా జరుగుతోంది. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ… పార్టీ ఫిరాయింపులను ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో.. పార్టీ మారిన ఎమ్మెల్యే ల నియోజకవర్గాల్లో యాత్ర చేస్తున్నారు. భద్రాచలం నుంచి ఈ యాత్రను భట్టి ప్రారంభిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అందులో ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండిచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మరో ఇద్దరు ఎమ్మెల్యే లను చేర్చుకుని… సీఎల్పీ ని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం కూడా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అధికార పార్టీ తీరు పై మండిపడుతోన్న కాంగ్రెస్ ఫిరాయింపులను నిరసిస్తూ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లోకే వెళ్లి వారి వైఖరిని ఎండగట్టాలని డిసైడ్ అయింది. భద్రాచలం రాములవారి గుడిలో పూజలు చేసి భట్టి యాత్ర ప్రారంభిస్తారు.
ఈ యాత్ర ద్వారా .. ప్రజల మద్దతు కూడగట్టుకుంటే… కేసీఆర్‌పై ఎంతో కొంత ఒత్తిడి పెరుగుతుందన్న ఆలోచనలో… కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే.. సీఎల్పీ నేతగా.. ఈ యాత్రను భట్టి విక్రమార్క చేపడుతున్నారు. కాంగ్రెస్‌లోని ఇతర నేతల మద్దతు ఎంత వరకు ఉందో మాత్రం …తెలియడం లేదు. ఎమ్మెల్యేలంతా వెళ్లిపోయినా ఉన్న కొద్ది మంది నేతల్లో ఒకరంటే.. ఒకరికి పడని పరిస్థితి ఉంది. ఒకరి ప్రయత్నాలకు ఒకరు అడ్డుకట్ట వేస్తారని అంటున్నారు. భట్టి విక్రమార్కకు.. తన సీఎల్పీ నేత హోదాను కాపాడుకోవడం అత్యవసరం కాబట్టి.. యాత్ర చేపడుతున్నారు. మిగిలిన నేతలకు.. ఇదేమీ పెద్ద అవసరం కాదన్న సెటైర్లు.. కాంగ్రెస్‌లోనే పడుతున్నాయి.