ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచీ పరిస్థితి అందరూ చూస్తున్నదే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందే సీఎస్ ని బదిలీ చేశారు. అంతకుముందు కొందరు ఎస్పీలనూ, ఇతర ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఎందుకు బదిలీ చేస్తున్నారనే వివరణ కూడా ఈసీ ఇవ్వలేదు. దాంతో కొందరు అధికారులు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఎల్వీ సుబ్రమణ్యాన్ని తీసుకొచ్చి సీఎస్ చేశారు. ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్వహించాల్సిన సమీక్షలే ఈయన నిర్వహించేసిన పరిస్థితి! ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఎన్నికల ఫలితాలు వచ్చే లోపు సాధారణ పరిపాలన వ్యవహారాలు చూసుకునేందుకు, సమీక్షలు నిర్వహించే అధికారం సీఎంకి ఉంటుందని లేఖ రాయడం చేశాం. ఈ తీరుపై సాక్షిలో ఒక సుదీర్ఘమైన వ్యాసం ప్రచురితమైంది. ఎన్నికల నియమావళిని చంద్రబాబు నాయుడు గౌరవించనట్టుగా రాసుకొస్తూ…. ఈసీ, వైకాపా తీరుని మాత్రం ప్రస్థావించలేదు!
ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్రావుని బదిలీ చేయాలని ఈసీ నిర్ణయిస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ జీవో తీసుకొచ్చేలా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారని రాశారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేయించి, సీఎస్ ని ఇబ్బందుల్లోకి నెట్టేశారని అన్నారు. దీంతో ఈసీ ఆగ్రహించి… సీఎస్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో అత్యంత అనుభవజ్ఞుడైన ఎల్వీ సుబ్రమణ్యాన్ని తీసుకొచ్చారట! చివరికి ఆయనపై కూడా విమర్శలు చేస్తూ, సహ నిందితుడనీ, కోవర్టు అనడంతో మొత్తంగా కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులందరికీ చంద్రబాబు ఆగ్రహం తెప్పించారట! ఇవన్నీ చేసేసి, ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం వల్ల ఏం ఉపయోగం అంటూ ఎడిటోరియల్ వ్యాసంలో సాక్షి రాసింది.
ఇంతకీ… ఇంటలిజెన్స్ డీజీని ఈసీ ఎందుకు బదిలీ చేసింది? కొందరు కలెక్టర్లనీ ఎస్పీలనీ ఏ కారణంతో ఎన్నికల విధులకు దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక రాజకీయ పార్టీ చేసిన ఫిర్యాదులకు లోబడి చర్యలు తీసుకుంటారా? చర్యలకు దిగే ముందు ఆ పార్టీ తమ ప్రయోజనాల కోసం ఈసీని వాడుకుంటోందన్న విశ్లేషణ చేసుకోరా? వైకాపా నేతలు ఫిర్యాదులు ఇచ్చిన మర్నాడే చర్యలుండేవి. చివరికి, ఈసీ తీసుకోబోయే చర్యల గురించి విజయసాయిరెడ్డి ముందుగానే చెప్పేస్తుండేవారు! ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు, ప్రజల అవస్థలు వీటన్నింటికీ కారణం ఎవరు..? ఈ కోణాన్ని సాక్షి వదిలేసి… ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే దీనంతటికీ కారణం అన్నట్టుగా విశ్లేషించుకొచ్చారు. రాష్ట్రంలో ఈరోజు ఈ పరిస్థితి ఉండటానికి మొదలు ఎవరు..? ఎన్నికల నియమావళి, నైతికత అంటూ నీతులు వల్లించే ముందు… వాటికి తాము ఇస్తున్న గౌరవం ఏపాటిదో కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి.