మోదీ స్వరం మారింది. ఇప్పుడు విపక్షాలపై ఎదురుదాడిని మరింత ముమ్మరం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు జాతీయస్థాయిలో చర్చకు తెస్తున్న అంశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోదీ….తనదైన శైలిలో భావ వ్యవక్తీకరణ చేస్తూ…ప్రజల్ని నమ్మించే యత్నం చేస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయ నేత ఎవరు అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమయింది. పనిలో పనిగా నామినేషన్ వేల ఎన్డీఏ నేతలను వెంటబెట్టుకుని బలప్రదర్శన కూడా చేశారు. మూడు విడతల తర్వాత దేశ రాజకీయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ఆ మార్పు చంద్రబాబేనని కనీస రాజకీయ అవగాహన ఉన్న వారికైనా స్పష్టమవుతుంది.
ఎన్డీఏ మిత్రులపై మోడీకి అంత ప్రేమ ఎప్పుడొచ్చింది..?
మూడు విడతల పోలింగ్ తర్వాత… ప్రధానమంత్రి నరేంద్రమోదీ… ప్రచార శైలిలో మాత్రమే కాదు… మిత్రపక్షాల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా… మారిపోయింది. ఐదేళ్ల కాలంలో.. ఎన్డీఏ పక్షాల మీటింగ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయని మోదీ… వారాణసీలో నామినేషన్ వేసిన సమయంలో మాత్రం.. మిగిలి ఉన్న మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానించారు. ఎన్డీఏ నేతలను వెంటబెట్టుకుని వెళ్లి నామినేషన్ వేశారు. ఎదురుపడితే నమస్కరించడానికి కూడా… సిద్ధపడని మోదీ… కూటమిలోని సీనియర్ నేతల కాళ్లకు నమస్కారాలు పెట్టి… వీడియోలు తీసి మీడియాకు విడుదల చేశారు. దీనికి కారణం.. విపక్ష కూటమే. చంద్రబాబు విపక్షాల కూటమిని ఎప్పటికప్పుడు కలిపి ఉంచేందుకు ధీటైన ప్రయత్నాలు చేయడం… మిత్రులపై ఆధారపడక తప్పని పరిస్థితి రావడమే దీనికి కారణం.
విపక్షాలపైనే ఐటీ, ఈడీ దాడులు..! హఠాత్తుగా సమర్థింపులు ఎందుకు..?
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కొన్ని పార్టీలు చేరకపోయినా ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్‌కే మద్దతుని ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో..మోదీని నేరుగా ఢీ కొట్టడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మొదటి దశలోనే ఎన్నికలు ముగియడంతో.. ఆయన తన పోరాటాన్ని పూర్తి స్థాయిలో మోదీపై కేంద్రీకరిస్తున్నారు. వీవీ ప్యాట్లలో కనీసం 50 శాతం స్లిప్పులను లెక్కించాలని జాతీయ స్థాయిలో పోరాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు… ఢిల్లీలో దీక్షకు సిద్ధపడుతున్నారు. విపక్షాలపై ఈసీ, ఐటీ, సీబీఐ, ఈడీ ఇలా అన్నిటినీ విపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారని చంద్రబాబు పదేపదే ఆరోపిస్తున్నారు. కక్షపూరితంగా బీజేపీయేతర పక్షాలపై ఐటీ దాడులను నిరసిస్తూ బాబుతో పాటు విపక్షాలు విరుచుకుపడడాన్ని గమనించిన మోదీ…ఇప్పుడు తాను తప్పు చేశానని భావిస్తే తన ఇంట్లోనే సోదాలు చేయవచ్చన్నారు. దీనిపై వెంటనే కౌంటర్లు పడ్డాయి. మోదీ చాపర్‌ను తనిఖీ చేసిన ఐఎఎస్ అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలంటూ మోదీని నిలదీయడం ప్రారంబించారు.
ఈవీఎంలపై పోరాటం పేరుతో విపక్షాలను ఐక్యంగా ఉంచుతున్న చంద్రబాబు..!
ఈవీఎం-వీవీ ప్యాట్ల విషయంలో పోరుబాట కావొచ్చు, ఐటీ దాడులు-వ్యవస్థల పతనంపై నిలదీత కావొచ్చు… పార్టీలను ఏకం చేస్తున్న నేతగా చంద్రబాబు ముందున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో… జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు. విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదా సాధన విషయంలో పోరాడుతూ మోదీని ఢీకొని….ఇప్పుడు జాతీయ స్థాయి అంశాలపై ప్రధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు చంద్రబాబు. వీవీ ప్యాట్లలో స్లిప్పుల లెక్కింపు కోరుతూ ఈసీపై పోరాడుతున్న క్రమంలో 20కి పైగా పార్టీల అగ్రనేతలతో ఢిల్లీ ధర్నాలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ ధర్నాకు మేధావులు, ప్రజాసంఘాల నేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. … అన్ని పార్టీలు కలిసి.. సుప్రీంకోర్టులో వీవీ ప్యాట్లపై పిటిషన్ వేయడంతో… అవన్నీ ఓ కూటమి అన్నచర్చ ప్రజల్లోకి వచ్చింది. అందుకే.. ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే… రోజుకో ప్రధాని ఉంటారంటూ… అమిత్ షా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.