యూపీ, బీహార్లో రైల్వే ఉద్యోగాల కోసం దక్షిణాది నుంచి గతంలో పెద్ద ఎత్తున యువత రైళ్లలో దరఖాస్తులు చేసేందుకు, పరీక్షలు రాసేందుకు వెళ్లేది. కానీ.. అక్కడ స్థానికులు మాత్రం… దక్షిణాది యువకుల్ని వెంటపడి కొట్టేవారు. పరీక్షలు రాయకుండా అడ్డుకునేవారు. కానీ.. అదే ఉత్తరాది వాళ్లు.. దక్షిణాదికి వస్తే ఏ అడ్డంకులు ఉండవు. పెద్ద ఎత్తున హాయిగా.. ప్రశాంతంగా పరీక్షలు రాసేసి పోతూంటారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తోంది. వారణాశి నుంచి పోటీ చేస్తామంటూ… తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన రైతులకు… అక్కడ నామినేషన్లు వేయకుండా అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వారణాశిలో..మోదీపై పోటీ చేయడానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక బీజేపీ నేతలు రకరకాల చిక్కులు కల్పిస్తున్నారు. కొంత మంది పోలీసులు కూడా.. రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దాంతో నామినేషన్లు వేయలేకపోయారు. సోమవారం చివరి రోజు కావడంతో.. ఆ లోపు నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాశి నియోజకవర్గం నుంచి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేయడానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వారు గెలవడానికి కాకపోయినా.. రైతుల దుస్థితిని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన రైతులు.. ఇప్పటికే.. వారణాశి చేరుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటును డిమాండ్ చేస్తూ.. కొంత మంది రైతులు… వారణాశిలో పోటీకి సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన కొంత మంది రైతులు కూడా.. నామినేషన్లు వేసేందుకు వారణాశి వెళ్లారు. వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి నేతలు వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ శర్మ మోదీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ద్ రైతులకు వీరికీ అభ్యంతరాలు చెప్పారు. ప్రతిపాదించడానికి వచ్చిన ఓటర్లను కొంత మంది వెనక్కి పంపేయడంతో… అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. తమిళనాడు రైతులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. నామినేషన్ల దాఖలకు ఆఖరు రోజు…సోమవారం. ఆ లోపు… కనీసం వంద మందికిపైగా రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని అనుకుంటున్నారు. కానీ… ఆ అవకాశాన్ని అక్కడి అధికారులు, పోలీసులు కలిసి… కాలరాస్తారని… రైతులు… ఆందోళనకు గురవుతున్నారు.