మానవుడి జ్ఞాపక శక్తికి ఫ్రెష్ గా ఉండేదాని గురించే గుర్తుంటుందిగానీ, గతాన్ని ఎప్పటికప్పుడు మరచిపోతూ ఉంటుందన్నారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. ఏ పూటది ఆ పూట మాత్రమే గుర్తుంటుందనీ, ఇప్పుడు తింటే ఇంకాసేపు వరకూ మాత్రమే గుర్తుంటుందని అన్నారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఐదేళ్ల వరకూ చేసినవన్నీ ఒకెత్తు, ఎన్నికలకు కొద్దిరోజులు ముందు చేసింది మరో ఎత్తు అనీ, దాన్ని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తానో మాట చెప్పాననీ… నీ అంత అదృష్టవంతుడు మరొకడు లేడన్నానని జేసీ చెప్పారు. మూడు మాసాలు ముందు నువ్వు కలగనలేదనీ, ఏప్రిల్ 11న ఎన్నికలు వస్తాయని అనుకోలేదన్నాని చెప్పారు. ఆలోపుగానే, అంటే ఐదో తేదీని పసుపు కుంకుమ, తొమ్మిదో తేదీన రైతులకు చెక్కులు ఇచ్చారనీ… ఇవి సరిగ్గా ఎన్నికల ముందు ప్రజలకు వెళ్తాయని కలగనలేదని చంద్రబాబుతో చెప్పానన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి, పెళ్లిళ్లకు సాయం, వైద్య సహాయం, నదులు అనుసంధానం లాంటి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు చేశారనీ, కానీ వీటిని మెచ్చుకునేది కొద్దిమంది మాత్రమే అని చంద్రబాబుతో తాను చెప్పానన్నారు. ఇంత చేస్తున్నా అయితే ఏంటి అన్నట్టుగానే చాలామంది అనుకుంటున్నారని చెప్పానన్నారు. ఐదేళ్లుగా చేసినవన్నీ ఒకెత్తు అయితే, పదివేల రూపాయల పసుపు కుంకుమ, రైతులకు ఇచ్చిన ఆర్థిక సాయం ఎన్నికల్లో బాగా పనిచేశాయన్నారు. ఇది పార్టీలకు అతీతంగా ఓటరు మనస్థత్వాన్ని గురించి తన వ్యక్తిగత అభిప్రాయంగా చెబుతున్నదని జేసీ అన్నారు. ఎన్నికలు అత్యంత ఖరీదైనవి అయిపోయాయనీ, డబ్బులు ఇవ్వకపోతే నిలదీసి అడుగుతున్నవారిని తాను చూశానన్నారు. ఈ పరిస్థితికి ప్రజలనొక్కరినే తప్పుబట్టలేమనీ, నాయకులు, అధికారులు అందరూ బాధ్యులే అన్నారు. ఎన్నికల వ్యయాన్ని తగ్గించకపోవడం వల్లనే అవినీతి సంపాదన పెరుగుతోందన్నారు. ఒకవేళ ఎన్నికల వ్యయాన్ని కట్టడి చేయగలిగితే, అడ్డగోలుగా సంపాదించాల్సిన పని నాయకులకీ ఉండదన్నారు జేసీ.
జగన్ సీఎం అవుతాడన్న ధీమా వైకాపా వాళ్లకి ఉంటే ఉండొచ్చుగానీ, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడి అవసరం ఎంతైనా ఉందన్నారు జేసీ. ఆయనే మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. తనకీ కులాభిమానం ఉందిగానీ, రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడే కరెక్ట్ అని తాను నమ్ముతా అన్నారు. జేసీ వ్యాఖ్యలపై కొన్ని విమర్శలు తప్పేట్టుగా లేవు. ఎందుకంటే, ప్రజల ఆలోచనా విధానం తక్షణ లాభాలను గుర్తుపెట్టుకునేట్టుగా మాత్రమే ఉంటుందన్నారు. ఇక, జేసీ ప్రస్థావించిన ఇతర అంశాలు కొంత ఆలోచనాత్మకంగానే ఉన్నాయనీ చెప్పొచ్చు.