ఆంధ్రప్రదేశ్ లో గడచిన ఐదేళ్లపాటు ప్రతిపక్ష పార్టీ ఏం చేసింది..? ఎన్నికల కోసం ఎదురు చూసింది, అంతే! చివరి రెండేళ్లూ అసెంబ్లీకి కూడా వెళ్లలేదు. ప్రజల తరఫున మాట్లాడింది లేదు, సమస్యలపై చర్చించింది లేదు, పోరాడింది లేదు.. ఇవన్నీ వదిలేసి… ఇవాళ్లే ఏదో గుర్తించినట్టు… రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందంటూ ఆ పార్టీ పత్రిక సాక్షి ఓ కథనం రాసింది. ఐదేళ్ల పాలన ఫలితం… తీవ్ర దుర్భిక్షం అంటూ రాష్ట్రంలో కరువు పరిస్థితిని ఏకరవు పెట్టారు. ఐదేళ్ల పాలన వల్లనే కరువు పరిస్థితులు అన్నట్టుగా రాసుకొచ్చారు. కరువు మీద కంటే, కరువు పేరుతో గత ఐదేళ్ల పాలనపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ రాసుకొచ్చారు.
ప్రజలకు తిండి లేక, గ్రామాల్లో చేసుకుందామంటే పనుల్లేక ఎంతోమంది వలసలు పోతున్నారని కథనంలో రాశారు. చాలా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులున్నాయన్నారు. చాలా ఊళ్లలో వృద్ధులు, చిన్నపిల్లలు మాత్రమే కనిపిస్తున్నారనీ, వలస సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయనీ, కరువు మండలాలుగా ప్రకటించినా కూడా ప్రభుత్వం నుంచి పైసా రాలేదని రాసుకొచ్చారు. పశువులకు పశుగ్రాసంతోపాటు తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉందని రాశారు. వాస్తవానికి, చాలా గ్రామాల్లో ఈ పరిస్థితులున్నాయి. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితీ వాస్తవమే. అయితే, పరిస్థితులను సాక్షి ఎటు డైవర్ట్ చేసిందంటే… ఐదేళ్ల పాలన మీదికి! రబీకి ఏం చెయ్యాలన్న ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేయడం లేదనీ, వేసవిలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలోచనే లేదనీ, సాగునీటి ప్రాజెక్టుల్లో కమిషన్ల కక్కూర్తే తప్ప చిత్తశుద్ధి లేదనీ, అనాలోచిత నిర్ణయాలూ పాలన వల్లనే గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని విమర్శలు చేస్తూ వచ్చారు.
కరువు పరిస్థితులు వాస్తవమే. కానీ, ఐదేళ్లుగా ఇవే పరిస్థితులున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైకాపా ఏం చేసింది..? గడచిన ఎన్నికల్లో కరువు పరిస్థితులపై ఎందుకు టీడీపీని నిలదీయలేదు..? ఎందుకు పోరాటం చెయ్యలేదు..? ఇప్పుడు కొత్తగా గగ్గోలు పెడుతున్న ఈ సాక్షి పత్రిక కూడా… జగన్ ని ముఖ్యమంత్రి చేయడం ఒక్కటే అజెండా అన్నట్టుగా వ్యవహరించే తప్ప, ఎన్నికల సమయంలో కరువు పరిస్థితులపై ఎందుకు కథనాలు రాయలేకపోయింది..? గడచిన ఐదేళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎన్నున్నా… వాటి తీవ్రతను తగ్గించే చర్యలను ప్రభుత్వం తీసుకుంటూ వచ్చింది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న కారణంతో రోజువారీ పాలనా వ్యవహారాలను కూడా ముఖ్యమంత్రి నిర్వర్తించకూడదనే వాదన వినిపిస్తోంది ఎవరు..? దీంతో ఈ వేసవిలో ముందుగా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమీక్షలు జరగడం లేదు. తుఫాను ముంచుకొస్తోందని ఓపక్క వాతావరణ శాఖ గగ్గోలు పెడుతున్నా… ముందు జాగ్రత్త చర్యలపై ఎవ్వరికీ పట్టడం లేదు! సమీక్షలు పెడితే ముఖ్యమంత్రిది తప్పంటారు! రేప్పొద్దున్న ఆ తుఫాను వల్ల ఏదైనా నష్టం జరిగితే…. అది కూడా ఐదేళ్ల పాలన నిర్లక్ష్యమే అని సాక్షి రాసేస్తుందే తప్ప, వాస్తవిక పరిస్థితులు వారికి పట్టవు!