రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పబ్లిసిటీ కోసం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతే పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సంఘటనపై ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల మీద ఇప్పటి వరకు నోరు మెదపని జగన్:
జగన్ ట్వీట్ చేస్తూ, “విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? ” అని రాసుకొచ్చారు. అయితే జగన్ ట్వీట్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా అంత రచ్చ జరుగుతుంటే , విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్లెక్కితే, 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద స్పందించడానికి నోరు రాలేదు కానీ ఇప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా మీద స్పందించడానికి మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చేశాడు అంటూ సోషల్ మీడియాలో విరుచు పడ్డారు జనాలు . కేసీఆర్ ని ప్రశ్నించడానికి జగన్ కి ధైర్యం సరిపోలేదేమో అంటూ మరికొందరు చురకలంటించారు
జీఎస్టీ లాంటి పోర్న్ సినిమా తీసిన దర్శకుడికి జగన్ వకాల్తానా??
పైగా జీఎస్టీ లాంటి పొర్న్ సినిమా తీసిన దర్శకుడి సినిమా కోసం కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకొనే జగన్ ఒక వకాల్తా పుచ్చుకోవడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాంగోపాల్ వర్మ తీసిన జిఎస్టి సినిమా లో మియా మాల్కోవా నగ్నత్వం లో కూడా ఆధ్యాత్మిక ఉంది, భగవద్గీత ఉంది అంటూ కొంతమంది కుహనా మేధావులు భజన చేసినప్పటికీ చివరాఖరికి వచ్చేసరికి అది ఒక పోర్న్ సినిమాగానే మిగిలిపోయింది. అలాంటి సినిమా తీసి, తనకు ఎటువంటి సామాజిక బాధ్యత లేదు అంటూ తనకు తానుగా స్టేట్మెంట్లు ఇచ్చుకున్న రాంగోపాల్ వర్మ సినిమా కోసం జగన్ వకాల్తా పుచ్చుకోవడం ఏమిటి అంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కనీసం ఎన్నికల కమిషన్ ని ప్రశ్నించే ధైర్యం కూడా లేదా:
అలాగే, ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు కి ఎటువంటి అధికారాలు ఉండవు అని అటు సాక్షి, ఇటు సి ఎస్ తీర్మానం చేసిన తర్వాత జగన్ చంద్రబాబును ఈ సంఘటనకు బాధ్యులుగా చేస్తూ చేసిన వ్యాఖ్యల మీద కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ ది బాధ్యత కాబట్టి, ఈ పరిస్థితులని బట్టి కనీసం ఎన్నికల కమిషన్ ని ప్రశ్నించే దమ్ము జగన్ కి ఉందా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే పోలీసులని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం అవుతోంది. తన బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ముందు ఇదంతా సహజ మరణం అని , గుండెపోటు అని చెప్పి సాయంత్రానికల్లా గొడ్డలితో నరికారు అని మాట మార్చినప్పుడు పోలీసులని ఇలాగే బంట్రోతుల కన్నా హీనంగా వాడుకున్నారు అంటూ మరికొందరు విమర్శించారు.
ఎన్నికల కమిషన్ ని, కెసిఆర్ ని ప్రశ్నించలేని జగన్ మోడీని ప్రశ్నిస్తాడా?
మొత్తం మీద చూస్తే, ఎలక్షన్ కమిషన్ ని కానీ, కెసిఆర్ ని కానీ విమర్శించడానికి నోరు పెగలని జగన్ రేపొద్దున ముఖ్యమంత్రి అయితే మోడీని ప్రశ్నించి ప్రత్యేక హోదా తీసుకొస్తాడని ఆశించడం మూర్ఖత్వం అవుతుంది అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే, ఇటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో కానీ, అటు కేంద్రంతో కానీ ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడగలడా అన్న సందేహాలు ప్రజలకు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇది జగన్ వేసుకున్న మరొక సెల్ఫ్ గోల్ గా మిగిలిపోయేలా కనిపిస్తుంది.