వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుల మధ్య విమర్శలూ ప్రతివిమర్శలు మళ్లీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ట్విట్టర్ వేదికగా విజయసాయి చేస్తున్న విమర్శలు తెలిసినవే. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడా, లేదంటే.. కుటుంబరావా అంటూ అంటూ వైకాపా నేత చేసిన విమర్శలపై కుటుంబరావు కాస్త ఘాటుగానే స్పందించారు. తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయిరెడ్డి, ఆయనో దొంగ ఆడిటర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్నీ ఆయనకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నారనీ, దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో ముఖాముఖీ చర్చకు రావాలంటూ కుటుంబరావు సవాల్ చేశారు.
ఆర్థిక నేరాల కేసుల్లో ఇరుక్కుని, బెయిల్ మీదు బతుకుతున్నారనీ, ఆయనో పిచ్చి పట్టిన కుక్కలా ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు కుటుంబరావు. వాస్తవ పరిస్థితులపై వారికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వం అంటే భయం పట్టుకుందనీ, అందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏనాడూ అడగలేకపోయాన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడని విజయసాయి గుర్తుపెట్టుకోవాలన్నారు. సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందనీ, ఏయే పథకాల కింద ఎంతెంత ఖర్చులు పెట్టామనేది వారికి తెలియకపోతే… మెయిల్ ఐడీలు ఇస్తే వివరాలు పంపుతామన్నారు. అప్పుల విషయంలో గతంతో పోల్చితే మరీ ఎక్కువేమీ చెయ్యలేదని ఆయన చెప్పారు. ఆర్థిక అంశాల గురించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా తాను కూడా మాట్లాడొచ్చని చెప్పారు. వైకాపా నేత రామచంద్రయ్య గురించి మాట్లాడుతూ… ఆయన ఎన్ని పార్టీలు మారారో తనకు తెలీదని ఎద్దేవా చేశారు. ఎఫ్.ఆర్.బి.ఎమ్. పరిమితులకు లోబడే అప్పులు తీసుకున్నామనీ, దానికి సంబంధించిన వివరాలను కూడా ఆర్థిక సంఘానికి నివేదించామనీ, ఆ కాపీ కావాలంటే ఆయనకి పంపిస్తానని కుటుంబరావు అన్నారు.
కుటుంబరావు వెర్సెస్ వైకాపా నేతల మధ్య విమర్శలు రోజురోజుకీ స్థాయి మీరుతున్నాయి. అంశాలవారీ మొదలైన మాటల దాడులు… ఇప్పుడు వ్యక్తిగత విమర్శలూ ఆరోపణల వరకూ వచ్చేశాయి. విజయసాయిని పిచ్చికుక్క అంటూ, బెయిల్ మీద బతుకుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఏ స్థాయిలో స్పందిస్తారో చూడాలి. ఆయన చేసిన సవాల్ పై ఎలాంటి రియాక్షన్ వస్తుందో!