కేంద్రమాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు… కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై కోర్టుకు ఎక్కారు. రాజకీయ నేతగా, పారిశ్రామికవేత్తగా ఉన్న తన ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న రాజకీయ దురుద్దేశంతోనే సీబీఐ ..”బెస్ట్ అండ్ క్రాంప్టన్” అనే కంపెనీ కేసులో తనకు నోటీసులు జారీ చేసిందని..సుజనా చౌదరి ఆరోపిస్తున్నారు. తనకు ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తను ఇదే విషయాన్ని ఆధారాలతో సహా.. వెల్లడించి.. నోటీసులను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించినా మళ్లీ నోటీసులు జారీ చేసిందని.. సుజనా చౌదరి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖతోపాటు సీబీఐని చేర్చారు.
నిజానికి బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ సుజనా చౌదరిది అని కానీ.. ఆయనకు సంబంధం ఉందని కానీ…సీబీఐ ఎప్పుడూ చెప్పలేదు. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయో కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ చాలా కాలంగా సోదాలు చేస్తోంది. గతంలో సుజనా చౌదరి కార్యాలయంపైనా దాడులు జరిగాయి. ఆ తర్వాత చెన్నై ఈడీ కార్యాలయానికి సుజనాను పిలిపించి విచారించారు కూడా. కానీ ఆధారాలేమీ సేకరించలేకపోయారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ … బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించలేదు. అయితే బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అసలు యజమానులను గుర్తించడానికి దర్యాప్తు సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ సంస్థ సుజనాచౌదరిదేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇది కూడా.. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కేసులో తీసుకున్నచర్యే. సీబీఐ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ఈడీ వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.
కానీ ఇప్పటి వరకూ.. సుజనా చౌదరికి సంబంధం ఉన్నట్లు కానీ.. ఆయా కంపెనీలు… తీసుకున్న రుణాలు.. సుజనా చౌదరి కంపెనీల్లోకి తరలించినట్లుగా కానీ.. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఏ ఏ కంపెనీల్లోకి రుణాలు వెళ్లాయో… వాటి ఆస్తుల్ని సీజ్ చేశారు. కానీ.. ఎక్కడా సుజనా చౌదరి ఆస్తులను సీజ్ చేయలేదు. అయితే.. అనేక డొల్ల కంపెనీలు పెట్టారని.. వాటి ద్వారా నిధులు తరలించారని.. సుజనాచౌదరిపై.. మీడియాకు లీకులు ఇస్తున్నారు. అదే నిజమైతే.. ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవారని… సుజనా చౌదరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సుజనా చౌదరి.. నేరుగా సీబీఐపై కోర్టుకు ఎక్కి… కొత్త సంచలనం సృష్టించారనుకోవాలి.