పోలింగ్ కు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈసీ సాయంతో పదవి పొందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ బిజీ అంతా రోజు వారీ వ్యవహారాలకు సంబంధించిన కాదు… గత ఐదేళ్ల నిర్ణయాలకు సంబంధించిన వివరాలను.. రికార్డుల రూపంలో సేకరించడం కోసం అంటున్నారు. కొన్ని కీలక శాఖల నుంచి గత ఐదేళ్ల కాలంలో వివిధ ప్రాజెక్ట్ ల కోసం చేసిన వ్యయం, ఆడిట్ నివేదికలు, రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు, భూ సమీకరణ, ప్రాజెక్ట్ ల పురోగతి వంటి అంశాలపై ఆయన నేరుగా శాఖాధిపతుల నుంచి నివేదికలు కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఒక వైపు సీఎం చంద్రబాబు సమీక్షలకు ఎవరినీ వెళ్లొద్దని చెప్పి, మరోవైపు తాను చేసే సమీక్షలకు ఐదేళ్ల నివేదికలు కావాలని కోరుతూండటం.. ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో… డైలమాకు కారణం అవుతుంది. ఈ నివేదికలు ఇస్తే ఏమవుతుందోనన్న ఉద్దేశంతో కొంతమంది సీనియర్ ఐఏఎస్ లు సెలవుపై వెళ్లిపోయారు.
ఐదేళ్ల వివరాలను..సీఎస్ అడగడం వెనుక… ఎన్నికల తర్వాత అనుసరించాల్సిన ప్లాన్ ఉందన్న గుసగుసలు .. సచివాలయంలో వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే .. ఇప్పుడు ఎల్వీ చేస్తున్న పనుల కారణంగా.. ఆయనపై ప్రభుత్వం ఏ మాత్రం విశ్వాసం పెట్టుకునే అవకాశం లేదు. కేంద్రమే.. మొత్తం చేయిస్తోంది కాబట్టి… ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతారు. అక్కడ బీజేపీ వస్తే.. తాను సేకరించి సమాచారాన్ని బట్టి నిధుల వ్యయం జరిగిన తీరు, ప్రాజెక్ట్ లకు నిధులు, ఆడిట్ నివేదికలను బయట పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చని ఆయన ప్లాన్ చేసుకుటున్నారంటున్నారు. ఒక వేళ వైసీపీ అధికారంలోకి వస్తే.. ఆ నివేదికలు.. ఆ ప్రభుత్వానికి ఉపయోగపడతాయంటున్నారు.
సీఎస్ అడుగుతున్న నివేదికలు… పరిపాలన, నిధుల కేటాయింపులు, వ్యయానికి సంబంధించిన ఫైళ్లన్నీ ఆన్ లైన్ లో ఉన్నాయని.. కొత్తగా నివేదికలు అనేది ఆరాటం మాత్రమేనని.. సీనియర్ ఐఏఎస్‌లలో చర్చ జరుగుతోంది. ఈ నివేదికలకు అంతా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా వారంటున్నారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ను.. కొంత మంది ఉదహరిస్తున్నారు. మరో వైపు.. ఎల్వీ తాపత్రయం చూసి.. టీడీపీ నేతలు.. కూడా నవ్వుకుంటున్నారు. ఓ ఐఏఎస్ అధికారి ఎలా వ్యవహరించకూడదో.. ఆయన చూపిస్తున్నారని.. వారు అంటున్నారు. ఆ విషయం త్వరలోనే ఇతర అధికారులకు అర్థం అవుతుందంటున్నారు. మొత్తానికి ఎల్వీ వ్యవహరిస్తున్న తీరు… కొత్త పాఠాలను నేర్పుతోంది… అది రాజకీయ నాయకులకు.. ఇటు అధికారులకు కూడా..!