తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ఓ దశ, దిశ చూపించిన… రవిప్రకాష్.. తన మానసపుత్రిక టీవీ9ను వదులుకోవాల్సిన గడ్డు పరిస్థితిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఎడిటోరియల్ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో వేలు పెట్టే ప్రయత్నాన్ని కొన్నాళ్లుగా కొత్త యాజమాన్యం… చేస్తోంది. అయితే.. వాటిని రవిప్రకాష్ పడనీయలేదు. పూర్తి స్థాయిలో టీవీ9 ఎడిటోరియల్ విధానాన్ని.. తన ఆలోచనల ప్రకారమే నడిపిస్తున్నారు. ఇది… కొత్త యాజమాన్యానికి నచ్చలేదని తెలుస్తోంది. ఎందుకంటే.. బడా కాంట్రాక్టర్లు అయిన… మైహోం రామేశ్వరరావు, మేఘా ఇంజినీరింగ్ కృష్ణారెడ్డి.. మెజార్టీ వాటాలను… కొనుగోలు చేశారు. వారు ఈ చానల్‌ను కొనుగోలు చేయడానికి కారణం లాభాలు కాదు. వారి వ్యాపారాల్లో వారు సంపాదించే లాభాలతో పోలిస్తే.. టీవీ9తో వచ్చేది చాలా స్వల్పం. వారి లక్ష్యం… టీవీ9 న్యూసే.
రాజకీయ కారణాలతోనే.. టీవీ9లో మెజార్టీ వాటాను… వీరు కొనుగోలు చేశారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే.. రవిప్రకాష్.. టీవీ 9కి మొదటి నుంచి కర్త, కర్మ , క్రియగా వ్యవహరించారు. శ్రీనిరాజు.. మొదట్లో 80 శాతం వాటాలతో పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ఆయన ఎప్పుడూ.. ఎలాంటి వివాదాస్పద పరిస్థితుల్లోనూ.. ఎడిటోరియల్ వ్యవహారాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు. అందుకే.. టీవీ 9 అంత సంచలనాత్మక విజయం సాధించిందనేది ఇండస్ట్రీ వర్గాలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు శ్రీనిరాజు.. తన వాటాను అమ్మేసుకున్నారు. కొత్త ఓనర్లు.. నలుగురు బోర్డు సభ్యులను.. నియమించారు. కానీ.. ఇలా నియమించడం నిబంధనలకు విరుద్ధమని.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరుగుతోంది. శ్రీనిరాజు అమ్ముకున్నప్పటికీ.. ఇతర వాటాదారులకు తెలియకుండానే… అమ్మకాలు చేయడంతో.. సమస్యలు వచ్చాయి.
వీటన్నింటి వెనుక.. రవిప్రకాష్ ఉన్నారని… మేఘా కృష్ణారెడ్డి, జూపల్లి రామేశ్వరరావు నమ్ముతున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో..పూర్తి స్థాయిలో తమకు యాజమాన్య హక్కులు రాకుండా… అలాగే తమకు కావాల్సినట్లుగా ఎడిటోరియల్ విధానాన్ని మార్చుకోకుండా… రవిప్రకాష్ ఇబ్బంది పెడుతున్నారని.. ఈ ఇద్దరు బడా కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు … అత్యంత విశ్వసనీయవర్గాలు.. తెలుగు360కి చెప్పాయి. ప్రస్తుతం వీరు.. ఈ వివాదాన్ని.. తెలంగాణ ప్రభుత్వంలో కీలక భూమిక నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దగ్గర పంచాయతీ పెట్టారని… టీవీ 9 నుంచి రవిప్రకాష్ అండ్ టీంను పంపేయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే… మరికొద్ది వారాల్లోనే రవిప్రకాష్ అండ్ టీం లేని టీవీ9ని చూడాల్సి రావొచ్చు. ఇది జరిగినప్పుడు.. తెలుగు మీడియా రంగంలో అనూహ్యమైన మార్పులు రావడం మాత్రం ఖాయం.