వైఎస్ఆర్సిపి నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు ఇంట్లో ఈ రోజు ఐటీ సోదాలు జరిగాయి. గతంలో ఆయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల గురించి బ్యాంకు ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే తమ పార్టీ ఎంపీ అభ్యర్థి మీద జరిగిన దాడులను ఖండించే దమ్ము ఆ పార్టీ ముఖ్య నేత జగన్ కి కానీ, ఆ పార్టీ లో రెండవ స్థానంలో ఉన్న నేత విజయసాయి రెడ్డికి కానీ ఉందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు జనాలు.
వివరాల్లోకి వెళితే, పవర్ ప్లాంట్ కోసం బ్యాంకుల నుండి అప్పుడెప్పుడో రుణాలు తీసుకున్న రఘురామకృష్ణంరాజు బ్యాంక్ లోన్ డిఫాల్టర్ గా ఉన్నారు. అయితే ఆ మొత్తం ఎంత అన్నది ఆయన స్పష్టంగా బయటకు చెప్పక పోవడంతో వేల కోట్లు కొల్లగొట్టాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దాంతో ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో తాను కేవలం 300 కోట్లు మాత్రమే బాకీ అని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు జరిగిన సోదాలు కూడా ఐటీ సోదాలు కావని, కేవలం తన స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవడానికి ఐటీ అధికారులు తమ ఇంటి దాకా వచ్చారని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు.
అయితే సాధారణంగా రాజకీయాల్లో ఆరోపణల పర్వం కొనసాగుతూ ఉంటుంది. ఒక పార్టీకి చెందిన నేత మీద ఎటువంటి దాడులు జరిగినా, వెంటనే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంతెందుకు రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ ని అడ్డుకుంటే ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ఇంట్లో దాడులు జరిగితే దాని పై , ఇటీవల రాంగోపాల్ వర్మ కి మద్దతుగా సోషల్ మీడియాలో స్పందించిన వైఎస్ జగన్ కానీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డి గాని, ఈ ఐటీ దాడులను ఖండించే సాహసం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. చాలామంది ప్రజలు వీరిద్దరికీ అంత ధైర్యం ఉండదని, కేంద్ర ప్రభుత్వం మీద కాదు కదా కనీసం కేంద్ర సంస్థల మీద కూడా ఆరోపణలు చేయడానికి వీరు సాహసించరు అని అంటున్నారు.
మరి జగన్ కానీ, విజయసాయిరెడ్డి గాని రఘురామకృష్ణంరాజు పై జరిగిన ఐటీ సోదాలను ఖండిస్తారా అనేది వేచి చూడాలి.