వారణాశిలో నరేంద్రమోదీపై పోటీ చేయడానికి… సిద్ధమైన..మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనికి కారణంగా అధికారులు.. వింతైన కారణాన్ని చెప్పారు. తేజ్ బహదూర్.. మొదట్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నామినేషన్ వేశారు. చివరి రోజు..సమాజ్ వాదీ పార్టీ ఆయనకు బీఫాం ఇచ్చింది. దాంతో.. తేజ్ బహదూర్.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే.. ఇండిపెండెంట్ గా దాఖలు చేసిన నామినేషన్ పేపర్లో, ఎస్పీ అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ పేపర్లలో…వివరాలు మ్యాచ్ కాలేదని… పరిశీలన సమయంలో నోటీసులు జారీ చేశారు. దానికి ఆయన వివరణ ఇచ్చినప్పటికీ… వారణాశి అధికారులు..నామినేషన్ తిరస్కరించారు.
తేజ్ బహదూర్ యాదవ్..జవాన్ గా ఉండేవారు. గతంలో.. ఓ సారి..విధుల్లో ఉన్నప్పుడు.. సైన్యం గురించి ప్రభుత్వం గొప్పగా చెబుతోంది కానీ.. కనీసం.. కడుపు నిండా నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని సోషల్ మీడియాలో వీడియోపోస్ట్ చేశారు. అది దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో… సైన్యం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి లేదా… దేశాన్ని కించ పరిచిన కారణాలతో.. ఎవరైనా జవాన్ ఉద్యోగం కోల్పోతే… ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే..తేజ్ బహదూర్ ఈ రెండు కారణాలతోనూ ఉద్యోగాన్ని పోగొట్టుకోలేదు. ఆ మేరకు సర్వీస్ సర్టిఫికెట్ కూడా ఉంది. వాటిని సమర్పించినప్పటికీ.. అధికారులు నామినేషన్ తిరస్కరించారు. దాంతో..తేజ్ బహదూర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఎస్పీ – బీఎస్పీ కూటమి కూడా అధికారుల మోదీకి అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు.
తేజ్ బహదూర్ ఎస్పీ అభ్యర్థిగా ప్రధానిపై పోటీ చేస్తున్నట్లు తెలియగానే… రియల్ చౌకీదార్ వర్సెస్ పబ్లిసిటీ చౌకీదార్ అంటూ.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా తేజ్ బహదూర్ కు మద్దతు పలికారు. అయితే అనూహ్యంగా ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయింది. ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిలబడిన అజయ్ రాయ్ మాత్రమే..మోడీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. మరికొంత మంది ఏపీ, తెలంగాణకు చెందిన రైతులు..ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నా.. నామమాత్రమే.