దేశంలో మావోయిస్టు భావజాలంతో ఉన్నవారిని అణచివేశామంటూ కేంద్ర హోం మంత్రి ప్రకటించి ఒక రోజు గడవకుండానే మహారాష్ట్రలో మావోయిస్టులు దాడికి దిగడం విశేషం! మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు గడ్చిరోలి జిల్లాలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాత్రతో పేల్చేశారు. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో ఇంకా నక్సల్స్ ఉన్నారనీ, వారిపై భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగినట్టు సమాచారం. నిజానికి, నిన్న రాత్రే.. అంటే మంగళవారం నాడే ఇక్కడ నక్సల్స్ దాడులకు దిగారు. గడ్చిరోలి జిల్లాలోని పురోడో జరుగుతున్న కొన్ని నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన దాదాపు 36 వాహనాలను నక్సల్స్ ధ్వంసం చేశారు. అదే రహదారిలో ప్రయాణిస్తున్న భద్రతా బలగాల వాహనాన్ని బుధవారం మధ్యాహ్నం నక్సల్స్ పేల్చేశారు.
నిజానికి, నక్సల్స్ కార్యకలాపాలకు అడ్డా అంటే ఛత్తీస్ గఢ్ అన్నట్టుగా ఉండేది. కానీ, ఈ మధ్య వరుస కొన్ని పరిణామాలు గమనిస్తే… మహారాష్ట్రలో మావోయిస్టుల కార్యక్రమాలు కాస్త ఎక్కువైనట్టుగా కనిపిస్తున్నాయి. గత ఏడాది మహారాష్ట్రలోనే పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట పౌరహక్కుల సంఘాలకు చెందిన నేతలను అరెస్టులు చేయడం, సోదాలు చేయడం, పక్క రాష్ట్రాల్లో ఉన్న వరవరరావు లాంటివారిని కూడా అరెస్టు చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కూడా భాజపా అధికారంలో ఉంది. కేంద్ర, రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వచ్చాక నక్సల్స్ కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపామంటూ ఇటీవల ప్రకటనలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మావోలు ఇలా దాడికి దిగారంటే… తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంగానే భావించొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. అంతేకాదు, నక్సలిజం అయిపోయిందనీ, కోరలు పీకేశామంటూ ఇటీవల ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, సానుభూతి పరులను నిర్బంధించడం వంటి చర్యలకు ప్రతీకారంగా కూడా ఈ చర్యను భావించొచ్చు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయనీ, ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి అంజలి ఘటిస్తున్నా అంటూ ఆయన ట్వీట్ చేశారు. అసలే ఎన్నికలు జరుగుతున్న సమయం ఇది! దేశంలో తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అణచివేశామంటూ భాజపా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న ఈ తరుణంలో… మావోయిస్టుల దాడికి ప్రతిదాడి కచ్చితంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.